దుబ్బాక బైపోల్: తెలంగాణ ప్రభుత్వంపై ఈసీకి ఫిర్యాదు చేసిన రఘునందన్ రావు..!

Thursday, October 8th, 2020, 08:55:28 AM IST

దుబ్బాక ఉప ఎన్నికలో దాదాపు అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించడంతో ప్రచారం మరింత ఊపందుకుంది. అధికార టీఆర్ఎస్ పార్టీ తరపున సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాతకే టికెట్ దక్కగా, బీజేపీ నుంచి రఘునందన్ రావుకు, కాంగ్రెస్ నుంచి చెరుకు శ్రీనివాస్ రెడ్డిలకు టికెట్లు దక్కాయి. అయితే రెండు రోజుల క్రితం హైదరాబాద్ శివారులోని శామీర్‌పేట్‌లో ఓ కారులో 40 లక్షలు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్న సంగతి తెలిసిందే.

అయితే డబ్బుతో పట్టుబడిన వారి ఫోన్ కాల్స్ ఆధారంగా ఆ డబ్బు దుబ్బాక ఉపఎన్నికల్లో పోటీచేస్తున్న బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు సంబంధించినదని పోలీసులు తేల్చారు. అయితే దీనిపై బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు స్పందిస్తూ డాక్యుమెంట్లను చూడకుండా తాను ఏమీ చెప్పలేనని, ఫోన్ కాల్స్ సంభాషణ ఆధారంగా డబ్బు నాదే అని పోలీసులు చెబుతున్నారని అంటే నా ఫోన్‌ను తెలంగాణ ప్రభుత్వం ట్యాప్ చేసిందా అని ప్రశ్నించారు. అంతేకాదు తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. తన సిబ్బంది ఫోన్ కాల్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తుందని దీనిపై విచారణ చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు ఆదేశాలతో రాష్ట్ర పోలీసులు పనిచేస్తున్నారని రఘునందన్ రావు అన్నారు.