అమిత్ షా ప్రశంసకు పరవశించిన పురాణపండ శ్రీనివాస్, కొర్రపాటి

Wednesday, March 11th, 2020, 06:00:29 AM IST

న్యూ ఢిల్లీ :

ఎంతో ఓర్పుతో , ఎంతో నేర్పుతో ఇంతటి మహా కార్యాన్ని ఒక యజ్ఞంలా చేసిన తెలుగు ప్రతిభాశాలి పురాణపండ శ్రీనివాస్ అఖండ గ్రంధంతో పాటు ఆయన అకుంఠిత కృషి కూడా అందరినీ ఆకర్షిస్తుందని , హనుమంతుని అనుగ్రహం వల్లనే ‘ నన్నేలు నా స్వామి’ అనే ఈ అద్భుత సుందర మహాగ్రంధాన్ని తాను ఆవిష్కరించగలిగానని కేంద్ర హోమ్ శాఖామంత్రి అమిత్ షా పేర్కొన్నారు.

న్యూఢిల్లీలోని కేంద్ర హోంశాఖ కార్యాలయంలో ఈ ఉదయం ప్రముఖ రచయిత , ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధికారిక మాసపత్రిక ‘ ఆరాధన’ పూర్వ సంపాదకులు పురాణపండ శ్రీనివాస్ అద్భుత ఆంజనేయ మహాగ్రంధం ‘ నన్నేలు నాస్వామి’ ని ఆయన ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ ఆంజనేయ స్వామి పాత్ర మనకు ఉత్తమధర్మాచరణ నేర్పుతుందని , జీవన యాత్రలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న పురాణపండ శ్రీనివాస్ ఆత్మశక్తితో మహా విజయాలు సాధించడానికి హనుమంతుని అనుగ్రహమే కారణమని ‘ నన్నేలు నాస్వామి ‘ సౌందర్యమే నిరూపిస్తోంది అభినందించారు.

తొలిప్రతిని ఈ అపూర్వగ్రంధ సమర్పకులు , వారాహి చలన చిత్రం అధినేత సాయి కొర్రపాటికి అమిత్ షా అందజేశారు.ఈ గ్రంథ రచనా సంకలన కర్త పురాణపండ శ్రీనివాస్ నిర్మాణాత్మక సామర్ధ్యం , అసాధారణ ప్రతిభ, అద్భుత రచనా శైలి , విరామమెరుగక చేసే కృషి, నిస్వార్ధ సేవ తనను ఎంతో ఆకట్టుకోవడంతో , తాను ఆంజనేయస్వామిపై ఒక మహా గ్రంధాన్ని అందించమని శ్రీనివాస్ ని కోరడంతో ఈ అద్భుతాన్ని అందించారని , అమిత్ షా వంటి మహా శిఖరం ఈ గ్రంధాన్నిఆవిష్కరించడం తనను అనుభూతికి లోను చేసిందని సాయి కొర్రపాటి కృతజ్ఞతా పూర్వకంగా చెప్పారు.

ఈ అఖండ అక్షర యజ్ఞ కార్యంలో తానూ పాలు పంచుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కుమారుడు హర్షవర్ధన్ , మరొక కేంద్ర మంత్రి నిత్యానందరాయ్, కళా జనార్ధన మూర్తి తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో రచయిత పురాణపండ శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో ఆద్యంతం వినయంగా , మౌనం గా ఉండటం గమనార్హం.

తెలుగు రాష్ట్రాలలో పురాణపండ శ్రీనివాస్ రచనలు వేలాది ఆలయాలలో , ధార్మిక మండళ్లలో నిత్య పారాయణలై … ఆయనకు అభిమానులు కోకొల్లలుగా ఉండటం విశేషం.