ప్రజా సమస్యల పట్ల పట్టింపు లేని ధోరణికి ఇదే నిదర్శనం – కోదండరాం

Saturday, October 17th, 2020, 09:12:16 PM IST

తెలంగాణ రాష్ట్రం లో సీఎం కేసీఆర్ పనితీరు పై, పాలనా విధానం పై ప్రతి పక్ష పార్టీ నేతలు వీలు చిక్కినప్పుడల్లా వరుస విమర్శలు చేస్తూనే ఉన్నారు. అయితే త్వరలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ పై సైతం పలు విమర్శలు గుప్పించారు. జల విలయంతో జంట నగరాల ప్రజలు అల్లాడుతుంటే ఉద్యాన శాఖ పై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు అని అన్నారు. ప్రజా సమస్యల పట్ల పట్టింపు లేని ధోరణికి ఇదే నిదర్శనం అంటూ ఘాటు విమర్శలు చేశారు.

వరంగల్ – నల్గొండ – ఖమ్మం ప్రాంత ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నిక ప్రచారం లో భాగంగా నల్గొండ లోని నాగార్జున ప్రభుత్వ కళాశాల లో కోదండరాం పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల విషయం పై, ఓటు నమోదు ప్రక్రియ పై అవగాహన కల్పించారు. ఆన్లైన్ ప్రక్రియ ద్వారా ఓటు నమోదు సులువు అని, గెజిటెడ్ సంతకం అవసరం లేదు అని పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ వైఖరి పై మండిపడ్డారు. ప్రభుత్వం కీలక అంశాలను గాలికి వదిలేసి, ఆస్తుల నమోదు అంటూ ప్రజలను భయ బ్రాంతులకు గురి చేస్తోంది అని విమర్శించారు. ఇప్పటికే దుబ్బాక ఉపఎన్నిక విషయం లో కాంగ్రెస్ పార్టీ సైతం తెరాస తీరును ఎండగడుతూ సంచలన వ్యాఖ్యలు చేస్తోంది.