పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ప్రొఫెసర్ నాగేశ్వర్..!

Thursday, October 1st, 2020, 07:27:51 AM IST

మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ నాగేశ్వర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దమయ్యారు. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టుభద్రుల నియోజకవర్గం నుంచి మరోసారి పోటీ చేస్తున్నట్టు ఆయనే స్వయంగా ప్రకటించారు. అయితే తాను పోటీ చేస్తుంది ప్రజల సమస్యలు పరిష్కరించేందుకే అని, తాను ఎవరినో అడ్డుకోవడానికి ఈ ఎన్నికలలో పోటీ చేయడం లేదని అన్నారు.

అంతేకాదు ఏ అంశంపైనైనా తాను తన అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా చెబుతానని, మున్ముందు కూడా ఇదే ధోరణితో ముందుకెళ్తానని చెప్పుకొచ్చారు. ప్రజలకు మంచి చేసే ఎవరి నిర్ణయాలనైనా తాను స్వాగతిస్తానని, ప్రజావ్యతిరేక నిర్ణయాలను తాను వ్యతిరేకిస్తానని తెలిపాడు. ఎన్నికలలో పోటీ చేసేందుకు కావాల్సినంత డబ్బు తన దగ్గర లేదని, తాను ఎన్నికలలో డబ్బు ఖర్చు పెట్టనని. గెలిచిన తరువాత కూడా సంపాదించుకునేది ఏమీ ఉండదని అన్నారు. అయితే 2007,2009లో ఇదే నియోజకవర్గాల నుంచి పోటీ చేసి గెలిచిన ప్రొఫెసర్ నాగేశ్వర్ 2014 వరకు ఎమ్మెల్సీగా ఉన్నారు. అయితే తన విశ్లేషణలతో ఎంతోమందిని ప్రభావితం చేసే ప్రొఫెసర్ నాగేశ్వర్ ఈ సారి బరిలో ఉండడంతో ఈ ఎన్నికలకు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.