పార్క్ హయత్‌లో పార్క్ చేసిన సినీ నిర్మాత కారు చోరీ..!

Saturday, January 30th, 2021, 01:22:23 PM IST


హైదరాబాద్‌లోని ప్రముఖ హోటల్‌లో ఓ సినీ నిర్మాత కారు చోరీకి గురికావడం చర్చాంశనీయమయ్యింది. బెంగళూరుకు చెందిన ప్రముఖ వ్యాపారి, సినీ నిర్మాత వి.మంజునాథ్‌ ఈ నెల 22న హైదరాబాద్‌కు వచ్చాడు. ఈ క్రమంలో అతడు బంజారాహిల్స్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో బస చేశాడు. అయితే ఈ నెల 26న బయటికి వెళ్లి తిరిగివచ్చిన మంజునాథ్‌ను హోటల్ వద్ద డ్రాప్ చేసిన డ్రైవర్ సిల్వర్ కలర్ ఎస్‌యూవీ వాహనాన్ని హోటల్‌లోని పార్కింగ్ ప్లేస్‌లో పార్క్ చేశాడు.

అయితే మరుసటి రోజు ఉదయం బయటికి వెళ్లేందుకు డ్రైవర్ కారు తీయడానికి వెళ్లగా పార్కింగ్‌ స్థలంలో కారు కనిపించలేదు. విషయాన్ని డ్రైవర్ యజమాని మంజునాథ్‌కి చెప్పడంతో ఇద్దరు కలిసి కారు కోసం వెతికారు. అయితే కారు ఆచూకీ లభించకపోవడంతో మంజునాథ్ పోలీసులను ఆశ్రయించాడు. పార్క్ హయత్‌లో పార్క్ చేసిన తన కారు చోరికి గురైనట్టు బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అయితే ఆ కారులో నాలుగు చెక్ బుక్‌లు, లైసెన్స్ వెపన్ డాక్యూమెంట్స్, మొబైల్‌ఫోన్లు, బెంజికారు తాళాలు, బంగారంతో చేసిన వినాయకుడి విగ్రహం, భూమి పత్రాలు, ఇతర విలువైన వస్తువులు ఉన్నాయని మంజునాథ్ పోలీసులకు తెలిపాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.