సీఎం కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన పొన్నం ప్రభాకర్..!

Sunday, February 14th, 2021, 03:00:55 AM IST

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల నల్గొండ జిల్లా హాలియాలో టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ మహిళలను కుక్కలతో పోల్చడాన్ని పొన్నం తప్పుపట్టారు. మహిళలను కుక్కలతో పోల్చిన సీఎం కేసీఆర్ కూడా కుక్కనే అని అన్నారు. అయితే కేసీఆర్‎కు అసహనం పెరిగిందని, ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

ఇదిలా ఉంటే కేటీఆర్‌ను సీఎం చేయాలని కేసీఆర్ కలలు కంటున్నారని అది నెరవేరడం కలేనని అన్నారు. ఆనాడు సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకుంటే ఇదే కేసీఆర్, కేటీఆర్ ఎక్కడ ఉండేవారని పొన్నం ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి ఇప్పుడు నిరుద్యోగ భృతి ఇస్తానని మాయమాటలు చెబుతున్నారని అన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ రెండు ఒకటేనని ప్రజలు మిమ్మల్ని తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని పొన్నం ప్రభాకర్ అన్నారు.