కేసీఆర్ ఢిల్లీ పర్యటన ఎజెండా ఏంటో చెప్పాలి – పొన్నం ప్రభాకర్

Sunday, December 13th, 2020, 01:30:16 AM IST

తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనపై కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ ఢిల్లీ పర్యటనలో ఉన్న రహస్య ఎజెండా ఏంటో చెప్పాలని అన్నారు. ప్రధాని మోదీని వ్యతిరేకించిన వారిపై ఈడీ, సీబీఐ దాడులు జరిగాయని, ఒక్క కేసీఆర్ మీద మాత్రమే ఇప్పటి వరకు జరగలేదని అన్నారు. కేసులకు భయపడే కేసీఆర్‌ ఢిల్లీ పర్యటన చేస్తున్నారని అన్నారు. సీఎం కేసీఆర్‌కు రైతుల మీద నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీలోని రైతుల దీక్షా శిబిరాన్ని సందర్శించాలని అన్నారు.

ఇదిలా ఉంటే సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో భాగంగా నిన్న కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలతో భేటీ అయ్యారు. మరో రెండు రోజులపాటు ఢిల్లీలోనే ఉండనున్న సీఎం కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీతో పాటు మరికొందరు మంత్రులను కూడా కలిసే అవకాశం ఉంది. అయితే రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో కేసీఆర్‌ ప్రధాని అపాయింట్‌మెంట్‌ కోరడం ప్రాధాన్యతను సంతరించుకుంది.