వైసీపీ ఎమ్మెల్యేకు షాక్.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు..!

Sunday, December 27th, 2020, 02:40:05 PM IST

అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి షాక్ తగిలింది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి డ్రైవర్ సుబ్బరాయుడు‌ను ఎమ్మెల్యే పెద్దారెడ్డి కులం పేరుతో దూషించాడని పోలీసులకు ఫిర్యాదు రావడంతో పోలీసులు ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అంతేకాదు జేసీ ఇంటిపై రాళ్ల దాడికి పాల్పడడంతో పెద్దారెడ్డి ఇద్దరు కుమారులపై కూడా కేసు నమోదయ్యింది.

అయితే ఇటీవల క్రితం ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కుటుంబ సభ్యులు డబ్బులు వసూలు చేస్తున్నారని ఓ ఆడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. జేసీ అనుచరులే ఈ ఆడియోను క్రియేట్ చేశారని పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ మూడు రోజుల క్రితం తన అనుచరులతో కలిసి జేసీ ఇంటికి వెళ్ళి నానా హంగామా చేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి, జేసీ వర్గీయుల మధ్య రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్‌రెడ్డితో పాటుగా మరికొందరిపై కూడా పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే.