టీం ఇండియాకు మోడీ శుభాకాంక్షలు

Thursday, February 12th, 2015, 11:48:25 PM IST


క్రికెట్ కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో మనందరికీ తెలిసిందే. అందులోను ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఇక చెప్పేదేముంది. గల్లిలో ఉండే పిల్లవాడి నుంచి ఢిల్లీలో ఉన్న ప్రధాని వరకు అందరి దృష్టి ఆ మ్యాచ్ మీదనే ఉంటుంది. 2011లో ప్రపంచ కప్ ఇండియా గెలిచిన తరువాత ఇండియాపై అంచనాలు పెరిగాయి. ఇక ఈ సంవత్సరం వరల్డ్ కప్ వేడుకలు ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్ దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. అయితే, ఈరోజు ప్రపంచ కప్ ఆరంభ వేడుకలు అట్టహాసంగా ప్రారంభం అయ్యాయి. దీంతో ప్రపంచ కప్ అధికారికంగా ప్రారంభం అయినట్టే లెక్క.

ఇక ఇండియా పూల్ బి లో ఆడుతున్నది. ఈ పూల్ బిలో ఇండియా తో పాటు పాకిస్తాన్, సౌత్ ఆఫ్రికా, వెస్ట్ ఇండీస్, యూఏఈ మరియు ఆఫ్ఘనిస్తాన్ దేశాలు ఉన్నాయి. ఫిబ్రవరి 15న ఆస్ట్రేలియాలోని అడిలైడ్ ఓవల్ మైదానంలో ఇండియా పాకిస్తాన్ జట్లు మొదటి మ్యాచ్ ఆడనున్నాయి. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే క్రేజ్ ఉంటుంది. ఇక ఇప్పటివరకు ప్రపంచ కప్ లో ఇండియా పాకిస్తాన్ పై ఓడిపోలేదు. మరి గతంలో మాదిరిగానే పాక్ ను ఓడించి రికార్డు సృష్టిస్తుందో లేదంటే.. ఓడి రికార్డ్ సృష్టిస్తుందో తెలియాలంటే మాత్రం ఫిబ్రవరి 15వరకు ఆగాల్సిందే.

భారత ప్రధాని మోడీ, టీం ఇండియా జట్టులోని సభ్యులకు పేరుపేరున శుభాకాంక్షలు తెలుపుతూ ట్విట్టర్ ట్వీట్ చేశారు. డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగుతున్న భారత్ ఈ వరల్డ్ కప్ లోను నెగ్గి కప్ ను తీసుకురావాలని మోడీ కోరారు. ఒక్క మోడీ కోరికే కాదు, క్రికెట్ ను అమితంగా ఇష్టపడే సగటు భారతీయుడి కోరిక, ఆశ కూడా అదే. చూద్దాం ఏమిజరుగుతుందో.