మీరుంటేనే ఏ పండగైనా.. సైనికులనుద్దేశించి మాట్లాడిన ప్రధాని మోదీ..!

Saturday, November 14th, 2020, 06:13:43 PM IST

భారత ప్రధాని నరేంద్ర మోదీ దీపావళి వేడుకలను జైసల్మేర్‌లోని సైనికులతో కలిసి జరుపుకున్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ హిమాలయాల్లో ఉన్నా, ఎడారిలో ఉన్నా, దట్టమైన అడువులు, లోతైన సముద్రాలలో ఉన్నా శౌర్యంతో జవాన్లు పోరాడతారని మీ మధ్యలో దీపావళి జరుపుకుంటేనే తనకు నిజమైన పండగ అని అన్నారు. మీరుంటేనే దేశం ఉంటుందని, మీ త్యాగం వలనే దేశంలో ఏ పండుగైనా జరిగేదని అన్నారు.

అయితే సరిహద్దుల వెంట దేశం కోసం పనిచేస్తున్న సైనికులందరి కుటుంబాలకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. దేశం సురక్షితంగా ఉందంటే సరిహద్దుల్లో రక్షణగా ఉన్న సైనికుల వలనే అని తీవ్రవాదంతో, ఉగ్రవాదంతో, దేశ ద్రోహులతో జవాన్లు పోరాడుతూ దేశానికి రక్షణ కల్పిస్తున్నారని ప్రశంసించారు. దేశ ప్రయోజనాల విషయంలో భారత్ రాజీపడదన్న విషయాన్ని ప్రపంచం ఇప్పుడు అర్థం చేసుకుందని, దేశానికి ఈ ఖ్యాతి వచ్చిందంటే అది జవాన్ల శౌర్యం వల్ల మాత్రమే వచ్చిందని మోదీ ప్రశంసించారు.