మరింత జాగ్రత్త అవసరం.. జాతినుద్దేశించి ప్రసంగించిన మోదీ..!

Tuesday, October 20th, 2020, 09:16:09 PM IST


జాతినుద్దేశించి నేడు మరోసారి ప్రసంగం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో కరోనా తగ్గుముఖం పట్టిందని, ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని అన్నారు. వ్యాక్సిన్ వచ్చేంతవరకు మరింత జాగ్రత్తగా ఉండాలని అన్నారు. కరోనా సంక్షోభంలో జనతా కర్ఫ్యూ మొదలుకొని ఇప్పటివరకు ప్రజలంతా గొప్పగా సంయమనం పాటించారని, అయితే ఇప్పుడు పండగ సీజన్ కావడంతో మళ్ళీ అందరూ బయట యదేచ్చగా తిరుగుతున్నారని అన్నారు.

అయితే కరోనాతో పోరాటం విషయంలో ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుందని అన్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు బాగుందని, మరణాల రేటు కూడా తక్కువగానే ఉందని అన్నారు. అయితే పండగలను జరుపుకుంటూనే కరోనా పట్ల అప్రమత్తతను మరవవద్దని అన్నారు. మాస్క్ ధరించడం సహా ఇతర నియంత్రణ చర్యలను అంతా పాటించాలని అందరికి చేతులు జోడించి ప్రార్ధిస్తున్నట్టు కోరారు. మాస్క్ లేకుండా బయటకు వెళితే మనం మనతో పాటు మన కుటుంబాలను కూడా ఇబ్బందుల్లోకి నెట్టినవాళ్లమవుతామని అన్నారు. అయితే ప్రపంచమంతా కరోనా వ్యాక్సిన్ కోసం తీవ్రంగా పనిచేస్తుందని, కొన్ని వ్యాక్సిన్లు రెండో దశ, మూడో దశ ప్రయోగాల్లో ఉన్నాయని అన్నారు. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాక ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందిస్తామని చెప్పుకొచ్చారు.