ఏపీ లో మున్సిపల్ ఎన్నికలకి రీ నోటిఫికేషన్ పడనుందా?

Tuesday, February 23rd, 2021, 02:20:29 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. అయితే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలకి ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తుంది. అయితే ఇటీవల ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మున్సిపల్ ఎన్నికల విషయం పట్ల పలు వ్యాఖ్యలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. వచ్చే నెల మార్చి పదవ తేదీన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నాం అని వ్యాఖ్యానించారు. అంతేకాక 14 న ఓట్ల లెక్కింపు ఉంటుంది అని, మార్చి మూడవ తేదీన నామినేషన్ల ఉపసంహరణ కి తుది గడువు అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈ అంశం పై ప్రస్తుతం హైకోర్టు లో పిటిషన్ దాఖలు అయింది.

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా మున్సిపల్ ఎన్నికలు వాయిదా పడిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే కరోనా లాక్ డౌన్ కారణంగా ఎన్నికలు జరగకపోవడం తో అక్కడి నుండి ప్రక్రియ మొదలు కానుంది అని నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. అయితే నామినేషన్ ల ప్రక్రియ సమయంలో అభ్యర్థులను బెదిరించి నామినేషన్లు వేయకుండా చేశారు అని, పలు చోట్ల దాడులు కూడా జరిగాయి అని పలువురు తమ అభిప్రాయాలు వెల్లడించారు. అయితే ఇప్పుడు అదే అంశం పై కోర్టు లో విచారణ జరగనుంది. అంతేకాక ఆరు నెలలు మించి మున్సిపల్ ఎన్నికలు వాయిదా పడితే మళ్ళీ రీ నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది అని న్యాయవాదులు కోర్టుకు విన్నవించనున్నారు. అయితే దీని పై న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.