దివీస్‌పై పోరాటం.. ఎట్టకేలకు పవన్ పర్యటనకు అనుమతి..!

Saturday, January 9th, 2021, 12:48:31 AM IST


తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గం పరిధిలోని తొండగి మండలంలో ఉన్న దివీస్‌ లేబరేటరీస్‌ సంస్థ విస్తరణను వ్యతిరేకిస్తూ పోరాటం చేస్తున్న మత్స్యకారులు, దళితులు, ఆ ప్రాంత ప్రజలకు మద్దతుగా నిలిచేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు తొండగి మండలంలో పర్యటించి నిరసన చేపట్టనున్నట్టు ప్రకటించారు.

అయితే పవన్‌ కళ్యాణ్ పర్యటనకు తొలుత పోలీసులు అనుమతులు నిరాకరించినా తర్వాత అనుమతులు ఇస్తున్నట్టు తెలిపారు. పవన్‌ పర్యటనకు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ అనుమతి ఇచ్చారని ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. అయితే పవన్ పర్యటనకు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చినట్టు తెలుస్తుంది. అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారకుండా ఉండేందుకు పోలీసులు ముందస్తుగా 144 సెక్షన్‌ విధించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు అన్నవరం నుంచి ర్యాలీగా కార్యకర్తలు, నాయకులతో దివీస్‌ పరిశ్రమ ఏర్పాటు ప్రాంతాన్ని పరిశీలించనోతున్న పవన్, అనంతరం తొండంగి మండలం కొత్తపాకలు గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించనున్నట్లు సమాచారం.