పవన్ కళ్యాణ్‌కు కరోనా పాజిటివ్.. ఫామ్‌హౌస్‌లో చికిత్స..!

Friday, April 16th, 2021, 06:03:06 PM IST

తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. సామాన్య ప్రజలే కాకుండా ప్రజాప్రతినిధులు, సెలబ్రెటీలు కూడా కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. అయితే తాజాగా జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కరోనా బారిన పడ్డారు. అయితే ఈ నెల 3వ తేదిన తిరుప‌తిలో జ‌రిగిన పాద‌యాత్ర‌, బ‌హిరంగ‌స‌భ‌లో పాల్గొన్న ప‌వ‌న్ కళ్యాణ్ హైద‌రాబాద్‌కు తిరిగి వ‌చ్చిన త‌ర్వాత కాస్త అస్వస్థతకు గురికావడంతో కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అయితే కరోనా నెగెటివ్ రావడంతో అప్ప‌టి నుంచి ముందుజాగ్రత్తగా హోం క్వారంటైన్‌లో ఉన్నారు.

అయితే జ్వరం, ఒళ్లు నొప్పులు ఉండటంతో రెండు రోజుల క్రితం మరోసారి కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ వచ్చినట్టు తేలింది. అయితే ఖ‌మ్మంకు చెందిన వైర‌ల్ వ్యాధుల నివార‌ణ నిపుణులు, కార్డియాల‌జిస్టు డాక్ట‌ర్ తంగెళ్ల సుమ‌న్ హైద‌రాబాద్‌కు వ‌చ్చి ఫామ్‌హౌస్‌లోనే ప‌వ‌న్ కళ్యాణ్‌కు చికిత్స అందిస్తున్నట్టు తెలుస్తుంది. పవన్‌ ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్‌తోపాటు నిమ్ము చేరడంతో యాంటివైర‌ల్ మందుల‌తో చికిత్స చేస్తూ, అవసరమైనప్పుడు వైద్య బృందం ఆక్సిజన్ అందిస్తున్నట్టు సమాచారం. అంతేకాదు అపోలో నుంచి ఒక వైద్య బృందం కూడా వ‌చ్చి ప‌వ‌న్ కళ్యాణ్‌ను ప‌రీక్షించింది. ఇకపోతే చిరంజీవి, సురేఖ‌, రాంచ‌ర‌ణ్‌, ఉపాస‌న ఎప్ప‌టిక‌ప్పుడు ప‌వ‌న్ ఆరోగ్యం గురించి ఫోన్‌లో తెలుసుకుంటున్నట్టు తెలుస్తుంది.