ప్రచారం కోసం చట్టాలు చేస్తే మహిళలకు రక్షణ దొరుకుతుందా – పవన్ కళ్యాణ్

Friday, December 25th, 2020, 02:00:33 AM IST

అనంతపురం జిల్లా ధర్మవరంలో దళిత యువతి స్నేహలత దారుణ హత్యకు గురికావడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరును ఎండగట్టిన పవన్ కళ్యాణ్ ప్రచారం కోసం చట్టాలు చేస్తే మహిళలకు రక్షణ దొరుకుతుందా అని ప్రశ్నించారు. మహిళల రక్షణ కోసం దిశ చట్టం చేశాం… నేరం చేసినవారికి 21 రోజుల్లో శిక్ష పడుతుంది అంటూ ప్రచారం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఆచరణలో మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. మైనర్ బాలికలు, విద్యార్థినులు, యువతులు, మహిళలపై అఘాయిత్యాలు, దాడులు ఆగలేదు. ఉన్మాదుల చేతుల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వంలో చలనం ఉండటం లేదు. విజయవాడలో రెండు ఘటనలు, గాజువాకలో ఒక ఘటనలో యువతులు మృగాళ్ల చేతుల్లో హత్యకు గురయ్యారు. ఇప్పుడు అనంతపురం జిల్లా ధర్మవరంలో స్నేహలత అనే పేద దళిత యువతి హత్యకు గురవడం అత్యంత బాధాకరం’ అని పవన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

అంతేకాదు పేదకుటుంబానికి చెందిన స్నేహలత వేధింపులు భరించలేక చదువు మధ్యలోనే విడిచి పెట్టి చిన్నపాటి ఉద్యోగంలో చేరిందని, తమ బిడ్డను వేధిస్తున్నారు, ఇంటి ముందుకు వచ్చి భయపెడుతున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోగా అక్కడి నుంచి ఇల్లు మారిపోండని సలహా ఇవ్వడం చూస్తుంటే ఆ వ్యవస్థ ఎంత బాధ్యతారాహిత్యంతో ఉందో అర్ధమవుతుందని పవన్ అన్నారు. వ్యవస్థల వైఫల్యం వలనే స్నేహలత ఇద్దరు దుర్మార్గుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిందని ఆమె ఆత్మకు శాంతి కలగాలి, ఆమె కుటుంబానికి ప్రగాడ సానుభూతిని తెలియచేస్తున్నానని, ఆ కుటుంబానికి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ఇక చిత్తశుద్ధి లేకుండా ప్రచారం కోసం చట్టాలు చేస్తే ఎంత మాత్రం ప్రయోజనం ఉండదని అందుకు ఉదాహరణ దిశ చట్టమేనని పవన్ అన్నారు. దిశ చట్టం వచ్చి ఏడాది అయింది. చట్టం చేయగానే పాలాభిషేకాలు చేయించుకొని… కేకులు కోయించుకున్నారు. చట్టాన్ని మాత్రం ఆచరణలోకి తీసుకురాలేదు. ఆడ బిడ్డలపై పెట్రోలు పోసి నిప్పు పెట్టడాల, కత్తిపోట్లు మాత్రం ఆగలేదు. ప్రచారం కోసం చేసిన ఈ చట్టం ఆడబిడ్డలకు ఏ విధంగా రక్షణ ఇస్తుందో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు, హోంశాఖ మంత్రి సుచరిత గారు ప్రజలకు సమాధానం చెప్పాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.