ఆ ఎమ్మెల్యేపై క్రిమినల్ కేసు నమోదు చేయండి.. పవన్ కళ్యాణ్ డిమాండ్..!

Monday, January 18th, 2021, 05:53:29 PM IST

ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు తీరుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. తన గ్రామంలో పారిశుధ్య సమస్య ఎక్కువగా ఉందని, రహదారి లేదు, ఇతర ఏ సౌకర్యాలు లేవని ఎప్పుడు కల్పిస్తారంటూ ఎమ్మెల్యే అన్నా రాంబాబును జనసేన కార్యకర్త వెంగయ్య నాయుడు ప్రశ్నించారు. అయితే అందుకు ఎమ్మెల్యే రాంబాబు సమాధానం చెప్పలేక నీ మెడలో పార్టీ కండువా తీయ్.. అని మొదలుపెట్టి సభ్యసమాజం పలకలేని భాషలో మాట్లాడడం, తన అనుచరులతో బెదిరించడం, ఒత్తిళ్ళకు గురిచేయడంతో వెంగయ్య నాయుడు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు.

అయితే తన గ్రామంలో సౌకర్యాల కోసం ప్రజల తరపున ఎమ్మెల్యేను ప్రశ్నించడమే వెంగయ్య నాయుడు చేసిన తప్పా? గ్రామంలో కనీస సౌకర్యాల గురించి అడిగినందుకు ప్రాణాలు కోల్పోవల్సిందేనా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఇది వైసీపీ నిరంకుశ పాలనకు నిదర్శనమని వెంగయ్య నాయుడు ఆత్మహత్యకు అధికార పక్షం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. వెంగయ్య నాయుడు కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని తెలిపిన పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే, ఆయన అనుచరులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు.