ఆలయాలపై దాడులు పెరుగుతున్నా సీఎం ఎందుకు స్పందించడంలేదు – పవన్ కళ్యాణ్

Wednesday, December 30th, 2020, 04:41:26 PM IST

ఏపీలో ఆలయాలపై వరుస దాడులు జరుగుతున్నా సీఎం జగన్ స్పందించకపోవడాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా తప్పుపట్టారు. విజయనగరం జిల్లా రామతీర్థం క్షేత్రంలోని బోధికొండపై ఉన్న కోదండరాముడి విగ్రహం ధ్వంసం చేయడాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలని పవన్ కోరారు. రాముడి విగ్రహాన్ని శిరస్సు కనిపించకుండా ధ్వంసం చేసిన విధానం బాధ కలిగించిందని అన్నారు.

అయితే ఏపీలో ఏడాదిన్నర కాలంగా దేవతా విగ్రహాలు, ఆలయ రథాలు ధ్వంసం చేస్తున్నారని, అంతర్వేది ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, ఇంతవరకు అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహ స్వామి రథం దగ్ధం వెనక ఉన్నవారిని పట్టుకోలేదని రాష్ట్ర ప్రభుత్వంపై పవన్ మండిపడ్డారు. హిందూ ఆలయాలపై దాడులు పెరుగుతున్నా సీఎం జగన్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. హిందూ మతంపై ఒక పథకం ప్రకారమే దాడులు జరుగుతున్నాయని, అన్యమత పండుగ రోజు పవిత్ర తిరుమల క్షేత్రం నుంచి మంత్రులు శుభాకాంక్షలు చెప్పడం దురదృష్టకరమని అన్నారు. రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులకు సంబంధించి కేంద్ర హోంశాఖ దృష్టి సారించాలని, ఈ ఘటనలపై సీబీఐ దర్యాప్తు చేయించాలని అన్నారు.