అంతర్వేదం రథం నిర్మాణంపై పవన్ కళ్యాణ్ సరికొత్త డిమాండ్..!

Thursday, September 24th, 2020, 03:10:08 PM IST

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి ఆలయ రథం దగ్ధమైన ఘటన తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనపై హిందూ సంఘాలు, బీజేపీ, జనసేన నేతలు ఆందోళనలు చేయడంతో ఈ కేసును ప్రభుత్వం సీబీఐకి అప్పచెప్పింది. అయితే కొత్త రథాన్ని ప్రభుత్వ ఖర్చులతో నిర్మిస్తామని హామీ ఇవ్వడంతో ఈ వివాదం కాస్త సర్దుమనిగింది.

అయితే కొత్త రథం నిర్మాణ పనులని ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వానికి సరికొత్త డిమాండ్ వినిపించారు. నూతన రథం నిర్మాణంలో అగ్నికుల క్షత్రీయులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. అంతర్వేదిలో లక్ష్మీ నరసింహుడిని అగ్ని కులక్షత్రీయులు తమ కుల దైవంగా పూజిస్తారని, ఈ ఆలయాన్ని అగ్నికుల క్షత్రీయుడైన కొపనాతి కృష్ణమ్మ నిర్మించారని అన్నారు. ఈ దేవాలయానికి తొలి రథం కూడా కృష్ణమ్మ ఇచ్చినదే అని, అది శిథిలావస్థకు చేరుకున్నాక ఆ రథం స్థానంలో ఇటీవల అగ్నికి ఆహుతి అయిన రథం కూడా స్థానిక అగ్నికుల క్షత్రీయులు తయారుచేసిందే అని అన్నారు. కొత్త రథం నిర్మాణంలో అగ్నికుల క్షత్రీయ సంఘం వారికి ప్రాధాన్యత లేకపోవడంపై ఆవేదన చెందుతున్నారని అన్నారు. అగ్నికుల క్షత్రీయుల మనోభావాలను గౌరవించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, వారిని గౌరవిస్తూ రథం తయారీలో భాగస్వామ్యులను చేయాలని పవన్ కళ్యాణ్ కోరారు.