విశాఖ ఉక్కుపై పునరాలోచించాలి.. అమిత్ షాకు పవన్ విజ్ఞప్తి..!

Wednesday, February 10th, 2021, 02:23:54 AM IST


కేంద్ర హోంమంత్రి అమిత్ షాను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిశారు. అయితే పవన్ కళ్యాణ్ వెంట జనసేన పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. ముఖ్యంగా వీరి భేటీలో విశాఖ స్టీల్ ప్లాంట్‌ గురుంచి చర్చ జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై పునరాలోచించాలని కోరారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ ఓ వినతిపత్రాన్ని అమిత్ షాకు అందించారు.

అయితే విశాఖ స్టీల్ ప్లాంట్‌ ఆంధ్రుల హక్కు అని, విశాఖ స్టీల్ ప్లాంట్ సాధన కోసం 1960లో జరిగిన పోరాటంలో 32 మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో 18,000 మంది పర్మినెంట్ ఎంప్లాయిస్, 20వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారని అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణతో లక్షల మంది జీవితాలపై ప్రభావం పడుతుందని పవన్ చెప్పుకొచ్చారు. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్‌కు సొంతంగా గనులు కేటాయించాలని, ప్రజల సెంటిమెంట్‌ను దృష్టిలో పెట్టుకుని దాన్నిప్రైవేటీకరణను పునరాలోచించాలని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అమిత్‌షాను కోరారు.