ఏపీపీ ఎస్సీ ఉద్యోగాల క్యాలెండర్ ఏమైపోయింది – పవన్ కళ్యాణ్

Friday, December 11th, 2020, 07:31:29 AM IST


ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ గ్రూప్ 1 నిర్వహణ పై పునరాలోచించాలి అని జన సేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ ఉద్యోగాల క్యాలెండర్ ఏమైపోయింది అంటూ సూటిగా ప్రశ్నించారు. సరైన ప్రణాళిక లేని తీరు వలనే నిరుద్యోగులు నిరాశ చెందుతున్నారు అని పవన్ కళ్యాణ్ అన్నారు. గ్రూప్ 1 మెయిన్స్ నిర్వహణ పై పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేసిన పవన్, నోటిఫికేషన్ వస్తే చెప్పిన తేదీల్లో ఎలాంటి వివాదాలు, న్యాయ పరమైన చిక్కులు లేకుండా పరీక్షలు నిర్వహించి ఉద్యోగాలు భర్తీ చేస్తారనే నమ్మకాన్ని యువత కోల్పోతుంది అని పవన్ పేర్కొన్నారు.

అయితే ఏటా జనవరి లో ఉద్యోగాల భర్తీ కి సంబంధించి క్యాలెండరు ఇస్తామని చెప్పిన ఏపీ పీ ఎస్సీ , ఏళ్లు గడుస్తున్నా ఆ దిశగా అడుగులు వేయడం లేదు అని పవన్ విమర్శించారు. గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చి రెండేళ్లు అయింది అని, ప్రిలిమ్స్ పరీక్షా పత్రాల్లో 51 తప్పులు ఉన్నాయి అని, ఇందుకోసం నిరుద్యోగులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు అని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే నిరుద్యోగుల అభ్యంతరాలు ఏపీ పీ ఎస్సీ పరిగణన లోకి తీసుకోక పోవడం దురదృష్టకరం అని పవన్ కళ్యాణ్ అన్నారు. అయితే ఈ నెలలో మెయిన్స్ నిర్వహణ కి సన్నాహాలు చేస్తున్నారు అని, అదే సమయం లో ఇతర ఉద్యోగాలతో పాటు ఉన్నత విద్య అర్హత పరీక్షలు ఉన్నందున గ్రూప్ 1 మెయిన్స్ నిర్వహణ తేదీలు మార్చాలి అని అభ్యర్దులు జన సేన పార్టీ దృష్టికి తీసుకు వచ్చారు అని పవన్ పేర్కొన్నారు. ఈ సమస్యను మానవతా దృక్పదం తో పరిశీలించాలి అని పవన్ కళ్యాణ్ అన్నారు.