బీజేపీ ఎంపీ బండి సంజయ్ అరెస్ట్.. ఖండించిన పవన్ కళ్యాణ్..!

Tuesday, October 27th, 2020, 02:06:59 AM IST


తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ని పోలీసులు అరెస్ట్ చేయడాన్ని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఖండించారు. బండి సంజయ్‌ని అరెస్ట్ చేయడం పోలీసుల దుందుడుకు చర్య అని, పోలీసుల చర్యలు పలు సందేహాలకు తావిస్తోందని, ఉద్రిక్తతలకు తావిచ్చే విధంగా అధికారులు వ్యవహరిస్తున్నారని అన్నారు. ఎన్నికల నియమావళిని, నిబంధనలను అన్ని పార్టీలకు ఒకేలా వర్తింపచేయాలన్నారు.

అంతేకాదు దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ తరపున పోటీలో ఉన్న అభ్యర్థిని, కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేసేలా పోలీసులు వ్యవహరించడం గర్హనీయమని అన్నారు. ఇదిలా ఉంటే దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఇంట్లో మరియు బంధువుల ఇళ్లపై పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అయితే పోలీసుల తనిఖీలో 18.67 లక్షలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సమయంలో పోలీసులకు మరియు బీజేపీ కార్యకర్తలకు మధ్య వాగ్వివాదం జరిగింది. అయితే ఈ నగదుతో తనకు సంబంధం లేదని, తన ఇంట్లో దొరకకపోయినా తనదే అని పోలీసులు చెప్పడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ విషయం తెలుసుకున్న ఎంపీ బండి సంజయ్ సిద్దిపేటకు వస్తుండగా పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.