ఆ భూములను అమ్మితే న్యాయ పోరాటం చేస్తాం.. పవన్ కళ్యాణ్ హెచ్చరిక..!

Saturday, November 28th, 2020, 12:20:57 AM IST


మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠానికి సంబంధించి 208 ఎకరాల భూమిని వేలం ద్వారా విక్రయించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్టు జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్ తెలిపారు. దేవాదాయ శాఖకు చెందిన భూములకు ప్రభుత్వం కేవలం ట్రస్టీగా మాత్రమే వ్యవహరిస్తూ ఆస్తులను సంరక్షించాలి తప్పా అమ్ముకోవడానికి వీలులేదని, దీనికి సంబంధించి హైకోర్టు తీర్పు కూడా ఉందని పవన్ కళ్యాణ్ అన్నారు.

అయితే తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తుల విక్రయంలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం వలనే ప్రభుత్వం వెనక్కి తగ్గిందని అన్నారు. మే 25న టీటీడీ ఆస్తుల విక్రయాన్ని నిలిపివేస్తూ జీ.ఓ.888ను ప్రభుత్వం విడుదల చేసిందని, ఈ నిలుపుదల ఉత్తర్వులనే రాష్ట్రంలో అన్ని ఆలయాలు, మఠాల ఆస్తులకు వర్తింప చేయాలని పవన్ డిమాండ్ చేశారు. ఇక ధర్మ పరిరక్షణకు ఉద్దేశించిన దేవాదాయ ధర్మదాయ శాఖ – పాలకుల ఒత్తిళ్లకు తల్లొగ్గితేనే ఇలాంటి వేలం, విక్రయ ప్రకటనలు వస్తాయని అన్నారు. దాతలు ఇచ్చిన ఆస్తులను అమ్మకానికి పెడితే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని, దాతలు ఏ లక్ష్యంతో అయితే భూములు ఇచ్చారో దానికి మాత్రమే వినియోగించాలని పవన్ అన్నారు. అయితే దేవాలయ ఆస్తులకు ధర్మకర్తలుగా ఉండాల్సిన పాలకులు తామే యజమానులం అనుకోవద్దని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.