ఆ వైసీపీ నాయకుడిని అరెస్ట్ చేయరా.. పవన్ కళ్యాణ్ డిమాండ్..!

Friday, August 28th, 2020, 02:15:04 PM IST

జనసేన, బీజేపీ కార్యకర్తలపై దాడికి తెగబడ్డ వైసీపీ నేతను అరెస్ట్ చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలోని నిడిగట్టు పంచాయతీ నేరెళ్లవలసనకు చెందిన జనసేన కార్యకర్త మూగి ప్రసాద్, బీజేపీ కార్యకర్త మూగి శ్రీనివాస్‌లపై వైసీపీ నాయకుడు ఊళ్ళ చిన్నా హత్యాయత్నానికి పాల్పడ్డాడని, ప్రస్తుతం బాధితులు తీవ్ర గాయాలతో కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారని అయినా నిందితుడిని ఇంతవరకు పోలీసులు అరెస్ట్ చేయలేదని ఆరోపించారు.

ఆ ప్రాంతంలో వాలంటీర్‌గా పని చేస్తున్న వివాహితపై వైసీపీ నాయకుడు చిన్నా లైంగిక వేధింపులకు పాల్పడితే మూగి ప్రసాద్, మూగి శ్రీనివాస్‌లు అడ్డుకున్నారని అందుకే వారిపై కత్తితో దాడికి పాల్పడినట్టు జనసేన నాయకులు తెలిపారని అన్నారు. అయితే హత్య చేసేందుకు ప్రయత్నించిన అధికార పక్ష నేతను అరెస్ట్ చేయకుండా, బాధితుల పక్షాన నిలిచిన వారిని రాత్రికి రాత్రి అరెస్ట్ చేయడం పలు అనుమానాలకు తావిస్తుందని అన్నారు. వాలంటీర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడ్డ వ్యక్తిపై నిర్భయ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర డీజీపీ తక్షణం స్పందించి నిందితుడిని తక్షణమే అరెస్ట్ చేసి లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఘటన, హత్యాయత్నంపై కేసులు నమోదు చేయాలని కోరారు.