వైసీపీ ప్రభుత్వానికి ఎక్కడా చిత్త శుద్ధి లేదు – పవన్ కళ్యాణ్

Tuesday, November 10th, 2020, 11:04:58 PM IST


నంద్యాలలో ఆటో డ్రైవర్ అబ్ధుల్ సలాం ఇటీవల కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవడంపై స్పందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఓ వ్యక్తి తన భార్య, పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడంటే ఎంతటి ఒత్తిడిని, మానసిక వేదనను అనుభవించి ఉంటాడో అర్ధం చేసుకోవాలని అన్నారు. ఓ కుటుంబం సామూహికంగా ప్రాణాలు తీసుకునే పరిస్థితులు కల్పించినవారెవరు అని ప్రశ్నించారు. ఈ కేసు విషయంలో ప్రభుత్వ చర్యలు నాటకీయంగా కనిపిస్తున్నాయి తప్పా ఎక్కడా చిత్తశుద్ధి కనిపించడం లేదని అన్నారు.

అయితే ఇలాంటి ఘటనలు ఉత్పన్నం కావడానికి అసలు కారణం పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గడమే అని, వ్యవస్థలో భాగమైన పోలీసులు తమకున్న నియమ నిబంధనలను, చట్టాన్ని అనుసరించే క్రమంలో పాలకుల జోక్యానికి తావిస్తే ఇలాంటి దురదృష్టకర పరిస్థితులే తలెత్తుతాయని అన్నారు. అయితే అధికార పార్టీ నేతల చేతుల్లో అయుధాలుగా మారితే చివరకు ఇరుకున పడి బలిపశువులుగా మారేది క్షేత్ర స్థాయి విధుల్లో ఉండే పోలీసులే అని, అధికారంలో ఉన్న వారి నుంచి ఒత్తిళ్ళు వస్తే వాటిని నిలువరించి, నిబంధనలు పాటించే స్థైర్యం పోలీసుల్లో ఉన్నప్పుడే ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవని పవన్ కళ్యాణ్ చెపుకొచ్చారు. అయితే పోలీసులు తమ దగ్గరకు వచ్చే ప్రజల పట్ల మానవతా దృక్పధాన్ని కనబరచాలి, అప్పుడే ప్రజలకు పోలీస్ వ్యవస్థ పట్ల నమ్మకం కలుగుతుందని అన్నారు.