వైసీపీ నేతలు చేస్తున్న నిరసనలు మున్సిపల్ ఎన్నికల కోసం స్టంట్ – పవన్ కళ్యాణ్

Sunday, March 7th, 2021, 04:00:08 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ను బీజేపీ మినహా అన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. అయితే బీజేపీ తో పొత్తు ఉన్నటువంటి జన సేన పార్టీ సైతం ప్రైవేటీకరణ కి వ్యతిరేకం గా అడుగులు వేస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తో గట్టిగా మాట్లాడినట్లు పవన్ కళ్యాణ్ ప్రకటన ద్వారా వెల్లడించారు. అయితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పై వైసీపీ నాయకులు చేస్తున్న నిరసనలు మునిసిపల్ ఎన్నికల కోసం స్టంట్ అంటూ పవన్ కళ్యాణ్ విమర్శించారు. అయితే 22 మంది వైసీపీ ఎంపి లకు రాష్ట్రం పట్ల నిజంగా చిత్తశుద్ది, ప్రేమ ఉంటే స్టీల్ ప్లాంట్ కోసం ఏం చేశారో, మీ విధానం ఏంటో పార్లమెంటు సాక్షిగా చెప్పాలి అంటూ డిమాండ్ చేశారు.

అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ను పవన్ వివరించారు. కేంద్ర ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణలు విశాఖ ఉక్కు కర్మాగారం ను కూడా తాకాయి అని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తో ప్రభుత్వం కి నియంత్రణ ఉంటుంది కానీ వ్యాపారం చేయదు అంటూ స్పష్టం చేశారు. అయితే 1970 నుండి లైసెన్స్ రాజ్ విధానం వలన అనుకున్న విధంగా పరిశ్రమలు నడపలేక మూత పడటం, ప్రభుత్వం కి సంబందించిన భూములను ఎవరికి వారు అమ్ముకోవడం వలన కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకుంది అని వ్యాఖ్యానించారు. అయితే ఇది దేశాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకుందే తప్ప, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను మాత్రమే దృష్టి లో పెట్టుకొని తీసుకున్న నిర్ణయం కాదు అని పవన్ తేల్చి చెప్పారు. అన్ని పరిశ్రమల లాగానే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను అలా చూడవద్దు అని, అది ఆంధ్రుల ఆత్మ గౌరవ అంశం గా చూడాలని అమిత్ షా కి వివరించినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. అయితే టీడీపీ ఎంపి లు, వైసీపీ ఎంపి లు ఒక నిర్ణయం తీసుకొని పార్లమెంటు వేదికగా పోరాడండి అని పవన్ కళ్యాణ్ సూచించారు. అయితే అప్పుడు ప్రజలు చూస్తారు నమ్ముతారు అని అన్నారు.