ఎంపీ రఘురామ అరెస్టుకు ఇదా సమయం.. పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న..!

Saturday, May 15th, 2021, 03:00:16 AM IST

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారన్న కారణంగా ఆయనపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. అయితే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడన్న కారణంగానే ఎంపీ రఘురామను అరెస్ట్ చేశారంటూ ప్రతిపక్షాలు ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పిస్తున్నాయి. అయితే దీనిపై స్పందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎంపీ అరెస్టుకు ఇదా సమయం అని నిలదీశారు.

అయితే ఏపీలో కరోనా విజృంభిస్తున్న నేపధ్యంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని కదిలించి ప్రజలను రక్షించాల్సింది పోయి, ఎంపీ రఘురామకృష్ణంరాజును అరెస్ట్ చేయడం ఏ మాత్రం సమర్ధింపు చర్య కాదని అన్నారు. ప్రభుత్వాన్ని తరచూ తీవ్రంగా విమర్శిస్తున్నాడని సమయం, సందర్భం లేకుండా ఎంపీ రఘురామను అరెస్ట్ చేయడం సరికాదని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ఓ పక్క కరోనా సోకిన వారు ఆస్పత్రుల్లో బెడ్లు దొరక్క, ఆక్సిజన్ అందక, రెమిడిసివర్ ఇంజక్షన్లు బ్లాక్ మార్కెట్లకు తరలిపోతుండగా అవసరమైన మందుల కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వ యంత్రాంగం అంతా ప్రజల బాధలపై దృష్టి పెట్టాలని, ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం పోలీసు బలగాలను ఉపయోగించి అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.