రాష్ట్రంలో సెక్షన్ 144, పోలీస్ యాక్ట్ 30 విచ్చలవిడిగా ఉపయోగిస్తున్నారు

Friday, January 22nd, 2021, 12:50:54 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో జరుగుతున్న తాజా పరిణామాల పై జన సేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ పాలనా విధానం పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఆలయాల పై దాడులు జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది అంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే హిందువుల పట్ల ఒకలా, ఇతర మతాల పట్ల ఒకలా స్పందించడం తప్పు అంటూ పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని మతాల పట్ల సమభావమే సెక్యులరిజం అంటూ పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.

అయితే సెక్యులరిజం అంటే హిందూ దేవాలయాల పై దాడులు జరిగితే మౌనంగా ఉండటమా అంటూ సూటిగా ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం ఎలాంటి బాధ్యత లేకుండా వ్యవహరిస్తోంది అని, ఓ రథం పోతే ఇంకో రథం చేయించమంటారా పెద్దలు అంటూ పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తారు. అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో సెక్షన్ 144, పోలీస్ యాక్ట్ 30 విచ్చల విడిగా ఉపయోగిస్తున్నారు అంటూ మండిపడ్డారు. అయితే దళితుల పైనే ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడుతున్నారు అని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాక సోషల్ మీడియాలో ఏదైనా చిన్న పోస్టులు పెడితే నాన్ బెయిలబుల్ కేసులు పెడుతున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి అని, శాంతి భద్రతలు కాపాడాలని ఎవరైనా కోరితే వారిపై కేసులు పెడుతున్నారు అని, కానీ వైసీపీ ఎమ్మెల్యే లు మాత్రం విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే అదృష్టం అందలం ఎక్కితే, బుద్ది బురదలో పోర్లింది అన్న రీతిలో పాలన సాగుతోందని, పరిశ్రమలను ప్రోత్సహించాల్సిన నేతలు, పేకాట క్లబ్బులు నిర్వహించే స్థాయికి దిగజారారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే వీటన్నిటి పై అందరూ సమిష్టి గా పోరాడాలి అని, జన సేన అందుకు ముందు ఉంటుంది అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.