ఉప్పెన లో వైష్ణవ్ చాలా ఆకట్టుకునేలా ఉన్నాడు – పవన్ కళ్యాణ్

Thursday, February 11th, 2021, 01:53:08 PM IST

ఫిబ్రవరి 12 వ తేదీన విడుదల కానున్న ఉప్పెన చిత్రం పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రముఖ దర్శకుడు సుకుమార్ వద్ద అసిస్టెంట్ గా పని చేసి బుచ్చిబాబు సన దర్శకత్వం లో వస్తున్న ఈ చిత్రం లోని పాటలు, పోస్టర్లు, టీజర్ మున్ ట్రైలర్ వరకూ అన్నీ కూడా ఆకట్టుకున్నాయి. అయితే ఈ చిత్రం పై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అభిప్రాయాన్ని చెబుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

వైష్ణవ్ తేజ్ హీరో గా తొలి చిత్రం తోనే చాలా మంచి పాత్రను ఎంచుకున్నాడు అంటూ కితాబు ఇచ్చారు. మొదటి అడుగులో నే సవాల్ తో కూడుకున్న పాత్రను తీసుకున్న వైష్ణవ్ తేజ్ తప్పకుండా ప్రేక్షకుల మెప్పు పొందుతాడు అని అన్నారు. వైష్ణవ్ జాని చిత్రంలో చిన్నప్పటి హీరో పాత్రలో చేశాడు అని గుర్తు చేశారు. ఇప్పుడు హీరో గా ఎదిగాడు, ఇప్పుడు ఉప్పెన లో వైష్ణవ్ ఆకట్టుకునేలా ఉన్నాడు అంటూ పవన్ కళ్యాణ్ అన్నారు. దర్శకుడు బుచ్చిబాబు సన పై పవన్ కళ్యాణ్ ప్రశంసల వర్షం కురిపించారు. ఎంతో సమర్థవంతంగా తెరకెక్కించినట్లు అర్దం అవుతుంది అని ట్రైలర్ చూసి అన్నారు.

అయితే మనకు పరిచయం ఉన్న జీవితాలను, అందులోని ఏమోషన్స్ ను, మన నేటివిటీ ను కళ్ళ ముందుకు తీసుకు వచ్చే చిత్రాలు ఎప్పుడూ జ్ఞాపకం గా ఉంటాయి అని అన్నారు.వీటికి షెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉంటుంది అని తెలిపారు. రంగస్థలం, దంగల్ లాంటి చిత్రాల్లో ఉండే ఎమోషన్స్ ఎక్కువ కాలం మనకి గుర్తుండి పోతాయి అని పవన్ కళ్యాణ్ అన్నారు.ఉప్పెన చిత్రం లోని ఎమోషన్స్ కూడా తప్పక నచ్చుతాయి అని, చిత్రం ఘన విజయం సాధించాలి అని ఆకాంక్షిస్తూ పవన్ కళ్యాణ్ చిత్ర యూనిట్ కి అభినందనలు తెలియజేశారు.