వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కి పరిటాల సునీత వార్నింగ్..!

Thursday, December 10th, 2020, 04:40:28 PM IST

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ దివంగత మాజీమంత్రి రవిపై చేసిన సంచలన వ్యాఖ్యలు అనంత రాజకీయాలలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. పరిటాల రవిపై గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన టీడీపీ నాయకురాలు పరిటాల సునీత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిటాల రవి గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నావని హెచ్చరించారు. పరిటాల రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత బీసీ, ఎస్సీ, ఎస్టీలు ప్రశాంతంగా ఉన్నారని అన్నారు. నీ చరిత్ర మాకు తెలుసు, నీలా మాట్లాడి మా విలువ తగ్గించుకోలేమని మరోసారి పరిటాల రవి గురుంచి మాట్లాడితే ఊరుకునేది లేదని మాధవ్‌కు వార్నింగ్ ఇచ్చారు.

ఇదిలా ఉంటే నిన్న మీడియాతో మాట్లాడిన గోరంట్ల మాధవ్ టీడీపీ అధినేత చంద్రబాబు, దివంగత మాజీమంత్రి పరిటాల రవిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నక్సలైట్లు, ఫ్యాక్షనిజం పేరుతో పరిటాల రవి ఎంతో మంది తలలు నరికారని, చంద్రబాబు సహకారంతో ఎమ్మెల్యేగా ఆయన ఇలాంటి పనులు చేశారని ఆరోపించారు. పంట పొలాలను రక్తంతో తడిపిన చరిత్ర పరిటాల రవిది అని, ఇక ప్రత్యేక హోదాను పశువుల సంతలా కేంద్రానికి వేలంలో పెట్టి అమ్మిన వ్యక్తి చంద్రబాబు అని వ్యాఖ్యానించారు.