కొడాలి నాని ఒళ్లు దగ్గర పెట్టుకో.. స్వామి పరిపూర్ణానంద హెచ్చరిక..!

Wednesday, September 23rd, 2020, 01:20:10 PM IST

ఏపీ మంత్రి కొడాలి నాని ఇటీవల దేవాలయలపై చేసిన వ్యాఖ్యలపై స్వామి పరిపూర్ణానంద మండిపడ్డారు. ఒక బాధ్యతగల మంత్రి పదవిలో ఉండి నాని ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల చరిత్ర ఏనాటిది, ఈ నాని చరిత్ర ఏ పాటిదో అందరికి తెలుసని అన్నారు. వెంకటేశ్వర స్వామితో ఈ నాని ఢీ కొడుతాడా అని మండిపడ్డారు. రాజ్యాంగం కూడా ఆయన చదువుకోకుండా ఎమ్మెల్యే, మంత్రి అవ్వడం మన దురదృష్టకరమని అన్నారు.

మంత్రి కొడాలి నాని చేస్తున్న వ్యాఖ్యలు ముఖ్యమంత్రి జగన్‌కు వినిపిస్తున్నాయో లేదో తెలియదని అన్నారు. అయితే దీనిపై స్పందించకపోతే ఆయనే ఇలా మాట్లాడిస్తున్నారని ప్రజలలోకి సంకేతాలు వెళతాయని అన్నారు. మీ ప్రభుత్వానికి 150 సీట్లు వచ్చాయని, అందులో 149 స్థానాలు హిందువులు ఓట్లు వేస్తేనే వచ్చాయన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని అన్నారు. అయితే ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే హిందువులు పెట్టుకున్న నమ్మకానికి సీఎం జగన్ పునాదులను కూడా పొడిచేస్తున్నారని అన్నారు. గతంలో తిరుమలపై ఇలాంటి వ్యాఖ్యలు ఎన్నడూ వినలేదని అసలు చరిత్ర తెలియకుండా మాట్లాడితే హిందువులు చూస్తూ ఊరుకోరని అన్నారు. హిందూ దేవాలయాల గురించి మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడు అని, నీ స్థాయికి తగ్గ మాటలు మాట్లాడు అని అన్నారు. ఈ విషయంలో జగన్ స్పందించకపోతే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు.