ఏపీ లో మరొకసారి వాయిదా పడ్డ పట్టాల పంపిణీ

Wednesday, August 12th, 2020, 10:12:30 PM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమం మరొకసారి వాయిదా పడింది. న్యాయస్థానం లో ఇప్పటికే కేసు పెండింగ్ లో ఉండటం తో ఈ నెల 15 న ఇళ్ళ పట్టాల పంపిణీ వాయిదా పడింది. అయితే ఇప్పటికే ఈ కార్యక్రమం మూడు సార్లు వాయిదా పడగా, మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం సందిగ్ధం లో పడింది. ఈ వాయిదా ప్రక్రియ తో అక్టోబర్ 2 వ తేదీ న గాంధీ జయంతి సందర్భంగా ఇళ్ళ పట్టాలు ఇచ్చేందుకు జగన్ సర్కార్ సిద్దమవుతోంది.

దాదాపు 30 లక్షల మందికి పైగా ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకు అనుగుణంగా భూములను సైతం సిద్దం చేసి పంపిణీ కోసం ఎదురు చూస్తోంది. మొదటగా మార్చి నెలలో ఈ ఇళ్ళ స్థలాల పంపిణీ ఉందని తెలుపగా, ఉగాదికి వాయిదా పడింది, అనంతరం జూన్, ఆ తర్వాత కరోనా కేసుల పెరుగుదల తో మరొకసారి వాయిదా పడింది. అయితే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చే వాయిదా కి అయిన ఇళ్ళ స్థలాల పంపిణీ కార్యక్రమం చేపడుతుందో లేదో చూడాలి.