బిగ్ న్యూస్: ప్రగతి భవన్ ను ముట్టడించిన NSUI కార్యకర్తలు

Wednesday, August 12th, 2020, 03:50:53 PM IST

తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్న తరుణంలో ఓ యూ, యూ జి సెట్ పరీక్షలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమవుతోంది. అయితే ఈ నేపధ్యంలో విశ్వ విద్యాలయాల్లో పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ NSUI కార్యకర్తలు పిపీ ఈ కిట్ లను ధరించి ప్రగతి భవన్ ముట్టడి చేశారు. విశ్వ విద్యాలయాల్లో ప్రవేశ పరీక్షలు రద్దు చేయాలని ఇప్పటికే హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేసింది NSUI.

అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం వాటిని పట్టించుకోక పోవడం తో విద్యార్థులు ప్రగతి భవన్ ను ముట్టడి చేశారు. రోజురోజుకీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి కానీ, తగ్గడం లేదు. ఇలాంటి సమయంలో పరీక్షలు నిర్వహిస్తే విద్యార్థులు కరోనా వైరస్ భారిన పడే ప్రమాదం ఉంది అని ఆందోళన వ్యక్తం చేశారు. ఆందోళన వ్యక్తం చేస్తున్న కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొందరు గేటు దూకి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా వారిని సైతం పోలీసులు అడ్డుకున్నారు. అయితే కార్యకర్తలు అప్పటికి కూడా లోపలికి వెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నం చేశారు.