తెలంగాణలో రేపటి నుంచే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు షురూ..!

Thursday, December 10th, 2020, 11:00:57 PM IST

తెలంగాణలో రేపటి నుంచి వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. దాదాపుగా మూడు నెలల నుంచి ఆగిపోయిన రిజిస్ట్రేషన్ సేవలు మళ్ళీ ప్రారంభించాలని సీఎం కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగానే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ చేయాలని సూచించారు. ధరణి పోర్టల్‌లో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌పై హైకోర్టు డిసెంబర్ 9న ఆదేశాలు ఇచ్చింది.

అయితే ధరణి పోర్టల్‌లో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు ఆపాలని ఆదేశించలేదని హైకోర్టు స్పష్టం చేసింది. పాత పద్దతిలోనే రిజిస్ట్రేషన్లు కొనసాగించవచ్చని కోర్టు సూచించింది. ధరణిలో వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై ఉత్తర్వులు ఎత్తివేయాలని అడ్వకేట్ జనరల్ హైకోర్టును కోరగా దీనిపై ధర్మాసనం ధరణి జీవోల కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే మధ్యంతర ఉత్తర్వుల వల్ల రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయని అడ్వకేట్ జరనల్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు కొనసాగించవచ్చని, ధరణి పోర్టల్ కోసం సేకరించిన డేటాకు చట్టబద్దమైన భద్రత ఉండాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది.