ఏపీ సీఎస్‌కు మరో లేఖ రాసిన ఎస్ఈసీ నిమ్మగడ్డ..!

Saturday, January 9th, 2021, 11:09:18 PM IST

ఏపీలో స్థానిక ఎన్నికలను ఫిబ్రవరి నెలలో నాలుగు విడతలుగా జరుపుతున్నట్టు నిన్న ఎన్నికల కమీషన్ షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. కరోనా నేపధ్యంలో ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించే పరిస్థితుల్లో లేమని ప్రభుత్వం చెబుతున్నా, నిమ్మగడ్డ మాత్రం ఎన్నికలను నిర్వహించే తీరుతామని చెబుతున్నాడు. ఈ తరుణంలోనే ఎన్నికల నిర్వహణలో పాటించాల్సిన కీలక నియమాలను పాటిస్తూ ముందుకెళ్తున్నారు.

అయితే ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై తాజాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఎస్ఈసీ లేఖ రాసింది. ప్రవర్తనా నియామవళి గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే వర్తిస్తుందని, పట్టణ, నగర ప్రాంతాలలో ఎన్నికల ప్రవర్తనా నియామళి అమలులో ఉండదని నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ ద్వారా స్పష్టం చేశారు. అయితే పట్టణ ప్రాంతంలో సభలు నిర్వహించి గ్రామీణ ప్రాంతాల ప్రజలకు లబ్ధి చేకూర్చే పనులు చేపట్టవద్దని ప్రభుత్వానికి సూచనలు జారీ చేసింది. ఇలాంటి చర్యలు ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు అవుతాయని చెప్పుకొచ్చారు. అంతేకాదు ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ప్రభుత్వ సహకారం ఉండాలని లేఖ ద్వారా నిమ్మగడ్డ మరో సారి కోరినట్టు తెలుస్తుంది.