పంచాయతీరాజ్‌శాఖ అధికారులపై నిమ్మగడ్డ సీరియస్.. డెడ్‌లైన్ విధింపు..!

Friday, January 22nd, 2021, 06:54:20 PM IST

Nimmagadda-Ramesh-Kumar

ఏపీలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు నిన్న హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం రేపు నోటిఫికేషన్ రిలీజ్ చేసేందుకు సిద్దమయ్యింది. ఈ నేపథ్యంలోనే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఈ రోజు ఉదయం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హైకోర్టు తీర్పు అంశాలు, ఎన్నికల ప్రక్రియ అంశాలు, షెడ్యూల్ వివరాలను నిమ్మగడ్డ గవర్నర్‌కు వివరించారు. ఎన్నికలకు సహకరించేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని గవర్నర్‌ను కోరినట్లు తెలుస్తుంది.

అయితే గవర్నర్‌తో భేటీ అనంతరం నిమ్మగడ్డ పంచాయతీరాజ్ అధికారులతో సమావేశం కావాలని అనుకున్నారు. పంచాయతీ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్‌లు మధ్యాహ్నం మూడు గంటలకు తమతో సమావేశం కావాలని కోరినా వారు సమావేశానికి హాజర్ కాకపోవడంతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. చివరి అవకాశంగా 5 గంటలలోపు సమావేశానికి హాజరుకావాలని డెడ్‌లైన్ విధించినా వారు సమావేశానికి రాలేదు. అయితే పంచాయతీరాజ్ అధికారులకు ఇచ్చిన సమయం కన్నా గంట సేపు ఎక్కువగానే కార్యాలయంలోనే ఉన్న నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎవరూ రాకపోవడంతో కార్యాలయం నుంచి వెళ్ళిపోయారు.

ఇదిలా ఉంటే పంచాయతీ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్‌లు ఈ రోజు ఉదయమే క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌తో సమావేశమయ్యారు. అయితే సీఎం జగన్‌తో సమావేశమైన తర్వాత ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌‌ కుమార్‌తో భేటీకి అధికారులు రాకపోవడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. మరి వీరిపై ఎస్ఈసీ ఏ రకమైన చర్యలు తీసుకుంటారన్న దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది.