పంచాయతీ ఎన్నికల పై ఎస్ఈసీ కీలక వ్యాఖ్యలు

Monday, February 22nd, 2021, 11:42:10 AM IST

Nimmagadda-Ramesh-Kumar

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. అయితే ఈ మొత్తం ఎన్నికల ప్రక్రియ పై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో మొత్తం నాలుగు విడతల్లో పంచాయతీ ఎన్నికలు విజయవంతం గా ముగిశాయి అని వ్యాఖ్యానించారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 16 శాతం స్థానాలకు మాత్రమే ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగాయి అని అన్నారు. సుమారు 10,890 మంది సర్పంచ్ లు 46,500 మంది వార్డ్ మెంబర్ స్థానాలకు ఏకగ్రీవం అయినట్లు తెలిపారు. అయితే ఈ మొత్తం ఎన్నికల ప్రక్రియ లో యంత్రాంగం అంకిత భావంతో పని చేసింది అని ప్రశంసల వర్షం కురిపించారు.

అధికారులు అంతా కూడా ఎంతో విజ్ఞత, సంయమనం తో వ్యవహరించడం వలనే ఇది సాధ్యం అయింది అని, ఒక్కో విడత లో 90 వేలకు పైగా సిబ్బంది పని చేశారు అని, 50 వేలకు పైగా పోలీసులు సమర్థ వంతంగా పని చేశారు అని అన్నారు. అయితే ప్రతి విడత లో 80 శాతానికి పైగా స్వచ్ఛందంగా ఓటింగ్ లో పాల్గొన్నారు అని వ్యాఖ్యానించారు. అయితే దీని పై ఎన్నికల సంఘం పూర్తి గా సంతృప్తి వ్యక్తం చేస్తోంది అని నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. అయితే ప్రతి విడత లోనూ అన్ని శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు అని, క్షేత్ర స్థాయిలో సమన్వయం చేసుకుంటూ, ఏ ఒక్క చోట కూడా రీ పోలింగ్ జరిగేలా వ్యవహరించలేదు అని వ్యాఖ్యానించారు. ఎక్కడా కూడా ఎన్నికలు వాయిదా పడలేదు అని, రాజకీయ వర్గాలు, ఓటర్లు విజ్ఞత తో వ్యవహరించారు అని అన్నారు.

అయితే ఇలా చేయడం ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థ బలపడుతుంది అని అన్నారు.మీడియా కూడా కీలకంగా వ్యవహరించిన తీరు పట్ల ప్రశంసల వర్షం కురిపించారు. మార్చి 2 నుండి పురపాలక ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది అని వ్యాఖ్యానించారు.