ఇవ్వాల్టి తో ముగియనున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలం

Wednesday, March 31st, 2021, 11:49:17 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలం నేటితో ముగియనుంది. అయితే ఈ మేరకు మీడియా సమావేశం ఏర్పాటు చేసి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక ఎన్నికల ను విజయవంతంగా నిర్వహించాం అని, ప్రభుత్వ తోడ్పాటు తోనే ఇది సాధ్యం అయింది అని వ్యాఖ్యానించారు. అయితే తన ఓటు హక్కు విషయం గురించి ప్రస్తావిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ లో ఉన్న ఓటు హక్కును రద్దు చేసుకొని, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని సొంత గ్రామంలో ఓటరు గా చేరాలనీ దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. అయితే ఇది జిల్లా అధికారి పరిదిలో ఉండే అంశం అని, రాష్ట్ర ప్రభుత్వానికి సంబందించినది కాదు అని నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నారు.

అయితే ఇప్పుడు తన ఓటుకు సంబందించిన అప్పీలు జిల్లా కలెక్టర్ వద్ద పెండింగ్ లో ఉందని అన్నారు. దీన్ని టీ కప్పు లో తుఫాన్ మాదిరి గా సృష్టించారు అని, ఓటు హక్కు ఎందుకు ఇవ్వలేకపొతున్నారు అంటూ సూటిగా ప్రశ్నించారు. అంతేకాక దీనికి వేరే కారణాలు ఉన్నాయి అని అనుకోవడం అపోహలకు దారి తీస్తోంది అంటూ చెప్పుకొచ్చారు. అయితే పదవి లో ఉన్నంత వరకూ ఇలాంటి వ్యక్తిగత విషయాలను పట్టించుకోలేదు అని, పదవి విరమణ తర్వాత ఓటు హక్కు సాధించుకోవడానికి వెనకడుగు వేసేది లేదు అని, అవసరం అయితే కోర్టుకు అయినా వెళ్తా అంటూ చెప్పుకొచ్చారు. రాజ్యాంగం కల్పించిన హక్కును ఎవరూ కాదనడానికి వీల్లేదు అంటూ చెప్పుకొచ్చారు.