నిజాలు నిర్భయంగా మాట్లాడే అవకాశం వైఎస్ కల్పించారు – నిమ్మగడ్డ రమేశ్

Saturday, January 30th, 2021, 06:43:55 PM IST


ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా కడప జిల్లాలో పర్యటిస్తున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పంచాయితీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయని అన్నారు. రాజ్యాంగం ఇచ్చిన అధికారంతోనే తాను ఎన్నికలు నిర్వహిస్తున్నానని, కానీ కొందరు ప్రభుత్వ నేతలు తనపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. అయితే పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలపైనే ప్రధాన దృష్టి పెట్టామని, అయితే ఏకగ్రీవాలన్ని అక్రమమని తాను చెప్పడం లేదని, బెదిరింపు ధోరణిలో ఏకగ్రీవాలకు పాల్పడితే చూస్తూ ఊరుకోమని నిమ్మగడ్డ హెచ్చరించారు.

ఇదిలా ఉంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో తనకు మంచి సంబంధం ఉందని అన్నారు. అయితే తాను ఇప్పుడు ఈ పరిస్థుతుల్లో ఉన్నానంటే వైఎస్ఆర్ ఆశీర్వాదం వల్లేనని నిమ్మగడ్డ చెప్పుకొచ్చారు. రాజ్యాంగ వ్యవస్థ పట్ల ఎంతో గౌరవంగా ఉండే ఆయన నిజాలను చెప్పే స్వేచ్చ ఇచ్చారని, అందుకే ఆయన ఇచ్చిన ధైర్యంతో ఇప్పుడు కూడా నేను నిర్భయంగా మాట్లాడుతున్నానని నిమ్మగడ్డ చెప్పుకొచ్చారు.