జగన్ సర్కార్‌కు మరో షాక్ ఇచ్చిన నిమ్మగడ్డ.. అది ఆపాలంటూ లేఖ..!

Tuesday, November 17th, 2020, 03:51:42 PM IST

ఏపీలో రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డకు, జగన్ సర్కార్‌కు మధ్య మరో వివాదం మొదలైంది. కొత్త జిల్లాల ఏర్పాటుకు వేగంగా అడుగులు వేస్తున్న ప్రభుత్వానికి ఎస్ఈసీ షాక్ ఇచ్చింది. జిల్లాల పునర్విభజన ప్రక్రియను ఆపాలంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వానికి లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి నిమ్మగడ్డ ఆ లేఖను పంపారు.

అయితే ప్రస్తుతం రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఉందని, అది పూర్తయ్యే వరకు జిల్లాల పునర్విభజన చేయవద్దని లేఖలో సూచించారు. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను పరిగణలోకి తీసుకుని ఎన్నికల ప్రక్రియ చేపట్టామమని, ఇలాంటి నేపధ్యంలో జిల్లాలు పెంచితే ఎన్నికల నిర్వహణకు ఇబ్బందులు తలెత్తుతాయని, ముఖ్యంగా జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణకు సాంకేతికంగా సమస్యలు వస్తాయని లేఖలో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సాధ్యమైనంత తొందరగా రాష్ట్రంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలనే యోచనలో వైసీపీ ప్రభుత్వం ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తుంటే, మరోపక్క ఎస్ఈసీ ఆ ప్రక్రియను ఆపమంటూ లేఖ రాయడం ఇప్పుడు హాట్ టాఫిక్‌గా మారింది.