మంతి కొడాలిపై చర్యలు తీసుకోండి.. గవర్నర్‌కి నిమ్మగడ్డ ఫిర్యాదు..!

Thursday, November 19th, 2020, 04:49:47 PM IST

ఏపీ ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు మధ్య వివాదం ముదురుతుంది. నిన్న మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న నిమ్మగడ్డ ఆయనపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంపై ప్రభుత్వం, అధికార యంత్రాంగంతో తాను సంప్రదింపులు జరుపుతుంటే తనపై మంత్రి కొడాలి నాని ఉద్దేశ పూర్వకంగా విమర్శలు చేస్తున్నారని నిమ్మగడ్డ లేఖలో పేర్కొన్నారు. ఉద్యోగులను ఎన్నికల కమీషన్‌కు వ్యతిరేకంగా రెచ్చగొట్టే విధంగా కొడాలి నాని వ్యాఖ్యలు ఉన్నాయని తక్షణమే అతడిపై చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోరారు.

ఇదిలా ఉంటే నిన్న మీడియాతో మాట్లాడిన కొడాలి నాని రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్దంగా లేదని, రాజ్యాంగ వ్యవస్థలో ఉన్న నిమ్మగడ్డ రమేష్ సిగ్గులేకుండా టీడీపీ అధినేత చంద్రబాబు ఇస్తున్న లేఖలను చదువుతుండడం సిగ్గుచేటని అన్నారు. ఆయనకు నిజంగా దమ్ముంటే పదవి కాలం అయిపోయాక టీడీపీలో చేరి పోటీ చేసి గెలిచి చూపించాలని అన్నారు. కరోనా కారణంగా ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు ప్రభుత్వ ఉద్యోగులు సిద్ధంగా లేరని అన్నారు.