ఏపీ సర్కార్‌కు షాక్ ఇచ్చిన నిమ్మగడ్డ.. హైకోర్టులో మరో పిటీషన్..!

Wednesday, October 21st, 2020, 03:00:48 PM IST

ఏపీ ఎన్నికల సంఘం కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సహకరించడం లేదంటూ నిమ్మగడ్డ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం తరఫున హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. స్థానిక సంస్థల నిర్వహణకు ప్రభుత్వం సహకరించడం లేదని ఎన్నికల సంఘం ఆ పిటిషన్‌లో పేర్కొంది.

అయితే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తమకు సహకరించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది. అంతేకాదు ఎన్నికల కమీషన్ నిర్వహణకు ఖర్చయ్యే నిధులను ప్రభుత్వం మంజూరు చేయకుండా నిలిపి వేసిందని కూడా తెలిపారు. అయితే ఎన్నికల సంఘానికి 40 లక్షలకు గాను, 39 లక్షల నిధులు విడుదల చేశామని, ఏదైనా ఉంటే ప్రభుత్వాన్ని సంప్రదించాలని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వాదించారు. అయితే ఒక రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఎన్నికల సంఘం ప్రతిదానికి ప్రభుత్వాన్ని ఎలా సంప్రదిస్తుందని కోర్టు నిలదీసింది. అయితే ప్రభుత్వం ఏ విషయంలో సహకరించడంలేదన్న దానిపై పూర్తి అఫిడవిట్ సమర్పించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశిస్తూ, తదుపరి విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది.