వైసీపీ ప్రకటన చూసి ఆశ్చర్యపోయాం.. నిమ్మగడ్డ కీలక వ్యాఖ్యలు..!

Wednesday, October 28th, 2020, 05:06:46 PM IST

కరోనా కారణంగా ఏపీలో వాయిదాపడిన స్థానిక సంస్థల ఎన్నికలను తిరిగి నిర్వహించేదుకై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అభిప్రాయాలు సేకరించేందుకు నేడు రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశం ఏర్పాటు చేసింది. స్థానిక ఎన్నికల నిర్వహణపై ఆయా పార్టీల అభిప్రాయాలను ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ అడిగి తెలుసుకున్నారు.

అయితే సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ స్థానిక సంస్థలపై అభిప్రాయం తెలిపేందుకు ఏర్పాటు చేసిన సమావేశానికి 11 పార్టీలు హాజరయ్యాయని, మరో రెండు పార్టీలు మెయిల్ ద్వారా అభిప్రాయాన్ని తెలిపినట్టు చెప్పుకొచ్చారు. తమను ఉద్దేశిస్తూ వైసీపీ ఇచ్చిన ప్రెస్‌నోట్ తమను ఆశ్చర్యానికి గురిచేసిందని స్థానిక ఎన్నికల నిర్వహణపై ఆరోగ్యశాఖ అధికారులను సంప్రదించడం లేదన్న వైసీపీ ప్రకటనల్లో నిజం లేదని నిమ్మగడ్డ అన్నారు. కరోనా పరిస్థితిపై ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, వైద్యారోగ్యశాఖ కమీషనర్‌తో చర్చలు జరిపామని, సీఎస్ నీలం సాహ్ని అభిప్రాయాలను కూడా తెలుసుకోబోతునట్టు తెలిపారు. కోవిడ్-19 మార్గదర్శక సూత్రాలను పాటిస్తూ, కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను అనుసరిస్తూ ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహిస్తామని నిమ్మగడ్డ చెప్పుకొచ్చారు.