బిగ్ న్యూస్: ప్రధాని మోదీని చంపేస్తామని బెదిరింపు మెయిల్..!

Friday, September 4th, 2020, 08:30:14 AM IST

ప్రధాని నరేంద్ర మోదీనీ చంపేస్తామని వచ్చిన బెదిరింపు మెయిల్ ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతుంది. జాతీయ దర్యాప్తు ఏజెన్సీకు మోదీని చంపేస్తామని బెదిరిస్తూ మెయిల్ వచ్చింది. అయితే ఈ బెదిరింపు మెయిల్‌కు సంబంధించిన వివరాలపై ఎన్‌ఐఏ హోంమంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. ఓ ఈమెయిల్‌ ఐడీ నుంచి ప్రముఖ వ్యక్తులకు వచ్చిన బెదిరింపు కాపీలను హోంశాఖకు పంపుతూ వీటిపై తగిన చర్యలు తీసుకోవాలని ఎన్‌ఐఏ లేఖలో కోరింది.

ఇదిలా ఉంటే ఆగస్ట్‌ 8న వచ్చిన ఈ బెదిరింపు మెయిల్‌తో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. ప్రధాని మోదీ భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఎన్‌ఐఏ లేఖ ఆధారంగా హోంమంత్రిత్వ శాఖ ఈ వ్యవహారాన్ని ప్రధానికి భద్రతను కల్పించే స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌ దృష్టికి తీసుకెళ్ళింది. అసలు ఈ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవడానికి రా, ఇంటెలిజెన్స్‌ బ్యూరో, డిఫెన్స్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీల ప్రతినిధులను ఎన్‌ఐఏ రంగంలోకి దించింది.