ముగిసిన ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన

Saturday, June 1st, 2013, 01:40:58 AM IST


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. కాంగ్రెసు అధిష్టానం పెద్దలతో కిరణ్ రెండు రోజుల పాటు ముమ్మరంగా చర్చలు జరిపారు. ప్రణాళిక సంఘం సమావేశానికి ఢిల్లీ వెళ్లిన సిఎం హైకమాండ్ తో పనిలో పనిగా హైకమాండ్ తోనూ చర్చలు జరిపారు. సిఎం ఢిల్లీలో ఉండగానే టి కాంగ్రెస్ ఎంపీలు మందా వివేక్, కేశవరావు టిఆర్ఎస్ లో చేరుతున్నామంటూ ప్రకటన చేయడంతో హైకమాండ్ నష్టనివారణ చర్యలు చేపట్టింది. ఢిల్లీలోనే ఉన్న సీఎంను పిలిపించుకుని ఆజాద్ మాట్లాడారు. కేశవరావు మరికొంత మంది కాంగ్రెస్ నేతలు టిఆర్ఎస్ లో చేరతారంటూ వ్యాఖ్యానించడంతో ఆ నేతలు ఎవరన్నదానిపై ఆజాద్ తో కిరణ్ చర్చించారు. వారెవరో గుర్తించి పార్టీని వీడకుండా చేపట్టవలసిన చర్యలపై సిఎం కి సూచనలిచ్చనట్లు తెలుస్తోంది.

శుక్రవారం మరోసారి ఆజాద్ తో సీఎం భేటీ అయి రెండు గంటలపాటు చర్చలు జరిపారు. ప్రధానంగా రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్న ఖాళీలు పూరించడం, గవర్నర్ కోటా ఎమ్మెల్సీ భర్తీ పై అభ్యర్ధుల ఎవరెవరు అన్నదానిపై ఇరువురు చర్చించారు. ఏడుగురు అభ్యర్థులతో కూడిన ఫైనల్ లిస్టును ఇరువురు రూపొందించి సోనియాతో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి సోనియాగాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ హాజరయ్యారు. ఏడుగురు పేర్లలోనుంచి కొంతమంది పేర్లను ప్రస్తుతానికి సోనియా ఖరారు చేసినట్లు సమాచారం. ఇక ఎంపీలు పార్టీ వీడిపోవడంపై సోనియా గాంధీ కూడా కాస్త అసహనాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం.

సోనియాగాంధీతో భేటీ అనంతరం రాహుల్ గాంధీతో భేటీ అవ్వాలని సిఎం చేసిన ప్రయత్నాలు ఈ సారి కూడా ఫలించలేదు. కానీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తో మాత్రం కేవలం పదిహేను రోజుల్లో సిఎం ఆరుసార్లు భేటీ కావడం హైకమాండ్ ఏపీపై సీరియస్ గా దృష్టి పెట్టిటందనడానికి ఒక ఉదాహరణ అని నిపుణులు చెబుతున్నారు. ఇక మంత్రివర్గంలో ఖాళీల భర్తీకి సంబంధించి రాష్ట్రంలో త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల తర్వతే ముహూర్తం ఖరారయ్యేలా తెలుస్తోంది. మిగిలిన ముగ్గురు కళంకిత మంత్రుల పై ప్రస్తుతానికి చర్చ జరిగినా వెనువెంటనే వాళ్లపై చర్యలుండె అవకాశం లేనట్లు తెలుస్తోంది. ఒకవేళ చర్యలున్నా వాళ్లంతట వాళ్లే రాజీనామా చేసేలా హైకమాండ్ వ్యూహం రచిస్తోంది. ఛత్తీస్ గఢ్ ఘటన నేపథ్యంలో అటు హైకమాండ్ ఇటు కేంద్రం పూర్తి బిజీగా ఉండడంతో ఈ విషయం ప్రస్తుతం వాయిదా వేసేలాగే కనపడుతోంది. ఏదైనప్పటికీ సిఎం రెండురోజుల ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యంగా కళంకిత మంత్రుల్లో తీవ్ర ఉత్కంఠ కలిగించిన మాట వాస్తవం.