తాడిపత్రిపై సరికొత్త ట్విస్ట్.. ఆ అభ్యర్థులు కీలకంగా మారబోతున్నారు..!

Tuesday, March 16th, 2021, 12:23:59 AM IST

తాడిపత్రి మున్సిపాలిటీ ఏ పార్టీ కైవసం చేసుకుంటుందన్నది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేపుతున్న అంశం. ఇలాంటి తరుణంలో తాడిపత్రి ఎక్స్‌అఫిషియో ఓట్ల కేటాయింపులో తాజాగా మరో ట్విస్ట్‌ చోటుచేసుకుంది. టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి, వైసీపీ ఎమ్మెల్సీలు ఇక్బాల్‌, గోపాల్‌ రెడ్డి, శమంతకమణి దరఖాస్తులను ఈసీ తిరస్కరించింది. తాడిపత్రిలో వీరికి ఓటు హక్కు లేదని, ఓటు హక్కు ఉన్న చోటే సభ్యత్వం ఉంటుందని కమీషనర్ తెలిపారు.

అయితే తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి, అనంతపురం ఎంపీ రంగయ్యకు ఎక్స్‌అఫిషియో ఓట్లు జారీ అయ్యాయని, వారిద్దరు ఈ నెల 18న జరగబోయే మున్సిపల్ సమావేశానికి హాజరు కావాలని అధికారులు వారికి సమాచారం అందించారు. ఇదిలా ఉంటే తాడిపత్రిలో మొత్తం 36 వార్డులు ఉండగా అందులో టీడీపీ 18 వార్డులను, వైసీపీ 16 వార్డులను గెలుచుకోగా సీపీఐ‍ ఒక వార్డును, ఇండిపెండెంట్ అభ్యర్థి ఒక స్థానంలో గెలుపొందారు. అయితే చైర్మెన్ స్థానం దక్కించుకోవాలంటే 19 మంది బలం ఉండాలి. ప్రస్తుతం టీడీపీకీ 18 మంది బలం ఉండడంతో సీపీఐ, ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా తమ వారేనని చైర్మన్ పీఠం తమకే దక్కుతుందని టీడీపీ ధీమాతో ఉంది. ఇక వైసీపీకి 16 స్థానాలతో పాటు ఎమ్మెల్యే, ఎంపీ ఎక్స్ అఫీషియో రెండు ఓట్లు రావడంతో వైసీపీకి కూడా ఒకరి మద్ధతు ఉంటే సరిపోతుంది. ఈ క్రమంలో సీపీఐ, ఇండిపెండెంట్ అభ్యర్థులు కీలకంగా మారారు. వీరు ఏ పార్టీకైతే మద్ధతుగా నిలుస్తారో వారే చైర్మెన్ పీఠాన్ని దక్కించుకునే అవకాశం కనిపిస్తుంది.