తెలంగాణలో మరో కొత్త మండలం ఏర్పాటు.. ఏ జిల్లాలో అంటే?

Thursday, December 10th, 2020, 06:02:33 PM IST

ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత పలు కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలను ఏర్పాటు చేసిన కేసీఆర్ ప్రభుత్వం తాజాగా మరో మండలాన్ని ఏర్పాటు చేసింది. సిద్దిపేట జిల్లాలోని ధూళిమిట్ట కేంద్రంగా కొత్త మండలాన్ని ఏర్పాటు చేస్తూ నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హుస్నాబాద్‌ డివిజన్‌లోని 8 గ్రామాలతో ధూళిమిట్ట మండలాన్ని ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.

ఇప్పటి వరకు మద్దూరు మండలం పరిధిలో ఉన్న ధూళిమిట్ట, తోర్నల, బైరాన్‌పల్లి, లింగాపూర్‌, జాలపల్లి, బెక్కల్‌, కొండాపూర్‌,కూటిగల్‌ ఎనిమిది గ్రామాలు ఇక మీదట ధూళిమిట్ట మండల పరిధిలోకి రానున్నాయి. ఇదిలా ఉంటే దుబ్బాకలో బీజేపీ గెలిచిన తరువాత సీఎం కేసీఆర్ సిద్దిపేట జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు సమాచారం. నేడు సిద్ధిపేట జిల్లాలో పర్యటించనున్న సీఎం కేసీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపనలు చేయనున్నారు.