సంపాదకీయం : మోడీ అద్భుతం విజయం వెనకున్న రహస్యం…

Friday, May 16th, 2014, 08:41:14 PM IST


మిషన్ 272. ఇది ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే బీజేపీ స్ట్రాటజీ. సింగిల్ గా సీన్ లోకి వచ్చి.. దేశవ్యాప్తంగా సీట్లను దున్నేయాలనే లక్ష్యంతో మోడీ అండ్ టీమ్ సెట్ చేసుకొన్న టార్గెట్. అయితే బీజేపీ వ్యూహాం చూసి చాలామంది పిచ్చి అనుకొన్నారు. బ్రాండ్ మోడీ వాపు మాత్రమేనని దాన్నే బలుపు అనుకుంటున్నారని కామెంట్లు చేశారు. సంకీర్ణాల శకంలో మోడీకున్న వివాదస్పద ఇమేజ్ తో సొంతంగా 272 సీట్లు సాధించడం పగటి కలలన్నారు. కానీ విమర్శలన్నింటినీ సవాల్ గా స్వీకరించిన మోడీ.. తన లక్ష్యం నెరవేర్చుకున్నారు. అజ్ కే బాద్ మోడీ సర్కార్ అంటూ ప్రత్యర్థులకి చుక్కలు చూపించడానికి రెడీ అవుతున్నారు.

ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నారు.. ఓవరాక్షన్ అన్నారు.. అంతోద్దు.. భూమి మీద నిల్చోని ఆలోచించండి అన్నారు.. కానీ మోడీ మాత్రం ఎక్కడా తగ్గలేదు. మోడీ ప్రధాని అభ్యర్థిగా బరిలో ఉంటే.. మేం బీజేపీతో జత కట్టాం.. మీ దోస్త్ కటీఫ్ అంటూ ఎన్నికల ముందు దాకా విర్రవీగిన పార్టీలకు మోడీ తన మానియా ఏంటో చూపించారు. సొంతంగానే మ్యాజిక్ ఫిగర్ 272 మార్క్ దాటి తానేమీ గాల్లో మేడలు కట్టలేదని.. కరెక్ట్ విజన్.. దానికి తగ్గ కృషి ఉంటే అనుకొన్న లక్ష్యాన్ని సాధించవచ్చని చేతల్లో చూపించారు.

272 సీట్లు బీజేపీకి కూర్చోని లెక్కలేసినంత ఈజీగా ఏం రాలేదు. అడుగడుగునా పకడ్భందీగా వ్యూహాలు అమలు చేసి మరీ గెలుపును ఒడిసి పట్టుకొన్నారు కమలనాథులు. దీనికి చాలా ముందు నుంచే గ్రౌండ్ వర్క్ చేశారు. కాంగ్రెస్ సహా అనేక పార్టీలు పునర్ వ్యవస్థీకరణ పనులు చేసుకొంటూ కూర్చుంటే.. బీజేపీ మాత్రం మోడీ మానియాతో ఎంత శాతం ఓట్లు కొల్లగొట్టాలి… ఎన్ని సీట్లు సొంతంగా సాధించాలంటూ పావులు కదిపింది. నరేంద్ర మోడీ కటౌట్ ను ముందు పెట్టి మోడీ ఫర్ పీఎం నినాదంతో ఎన్నికల సమరంలోకి దిగింది. సింగిల్ గానే అధికారం అనే అజెండాతో మేథోమథనం చేసింది. గుజరాత్ తో పాటు బీజేపీ అధికారంలో ఉన్న గోవా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రులతో సమాలోచనలకు తెర లేపి.. అజెండాను చర్చించింది.

ఇక లోక్ సభ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలి. దేశవ్యాప్తంగా కమలాన్ని వికసింప చేయాలనే లక్ష్యంతో అహార్నిశలు కృషి చేసిన మోడీ.. విరామం లేకుండా.. ఊపిరి తీసుకోకుండా దేశ వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయడానికే ప్రాధాన్యత ఇచ్చారు. బీజేపీ ఆలోచనలు చూసి సంకీర్ణాల శకం మోడీ ఆలోచన రాంగ్ అని పెదవి విరిచిన వాళ్లకి కొదవే లేదు. కలిసొచ్చే పార్టీల మద్దతు తీసుకొంటేనే ప్రభుత్వాన్ని నడిపించడం అంతంత మాత్రంగా ఉన్న పరిస్థితుల్లో మోడీ ఓవర్ కాన్ఫిడెన్స్ గా ఉన్నారని.. ఏ తోడు లేకుండా ఒంటరిగా మ్యాజిక్ ఫిగర్ ను దాటాలంటే ఆలోచించాల్సిందేనని వార్నింగ్ లిచ్చారు.

ఇలాంటి విమర్శలు రావడానికి అనేక కారణాలున్నాయ్. మాంఛి ఊపులో ఉండి.. 15 రాష్ట్రాల్లో అధికారంలో ఉండి… ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ తో 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ జనంలోకి వెళితేనే ఆ పార్టీ సొంతంగా కనాకష్టంగా 200 మార్క్ దాటింది. ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకొంటే తప్ప అధికారంలోకి రాలేకపోయింది. సర్ధుబాట్ల సహకారంతో 200 మార్క్ దాటి కిందా మీదా పడుతూ యూపీఏ ప్రభుత్వాన్ని లాక్కొచ్చింది. అలాంటిది సింగిల్ గానే మెజార్టీ సాధించాలంటే బీజేపీ దాదాపు 150 % ఎక్కువ సీట్లు సాధించాలి.

అయితే ఎక్కడ చూసినా తన పేరు మారుమోగిపోవడంతో మోడీకి ఎక్కడలేని ఊపు వచ్చింది. ఆ గాలిలో బీజేపీ కూడా కొన్ని సంచలనాలు సృష్టించింది. సెమీ ఫైనల్ గా భావించిన రాష్ట్రాల ఎన్నికల్లో వరస విజయాలు నమోదు చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయంతో పార్టీలో మోడీ ఇమేజ్‌ బీభత్సంగా పెరిగిపోయింది. మోడీ సభలకు భారీ సంఖ్యలో వచ్చిన జనాలు మోడీ క్రేజ్ ఎలాగుందో చెప్పకనే చెప్పారు. దీంతో మొదట్లో నరేంద్ర మోడీని వ్యతిరేకించిన బీజేపీలోని కొందరు నేతలు తర్వాతర్వాత మోడీకి తామే అత్యంత సన్నిహితులమని చెప్పుకు తిరిగే రేంజ్ కి మోడీ ఎదిగారు.

ఇక బీజేపీ హిందీ బెల్ట్ ని నమ్ముకున్న పార్టీ. నార్త్ బెల్ట్ లో ఓట్ల ఊచకోత కోస్తే… అధికారంలోకి రావడం పెద్ద మ్యాటర్ కాదు. ఇలా గెలవాలంటే ముందు ఉత్తరప్రదేశ్ లో పాగా వేయాలి. ఢిల్లీకి షార్ట్ కట్ లాంటి యూపీలో లీడ్ లో ఉంటే వాళ్లనీ వీళ్లనీ బతిమాలాడుకోనక్కర్లేదనే విషయం బాగా తెలిసిన మోడీ 6 నెలల ముందే తన అనుచరుడైన అమిత్ షాను ఉత్తరప్రదేశ్ కి పంపి అక్కడ పార్టీని పాపులర్ చేయడంతో పాటు.. బీజేపీ అభ్యర్థుల్ని గెలిపించే బాధ్యత అప్పగించారు. ఎవరికి అంతుబట్టని వ్యూహాలు రచించడంలో దిట్టైన అమిత్ షా యూపీలో 50 ప్లస్ సీట్లు సాధించి మోడీని కోరికను నెరవేర్చడంలో కీలకపాత్ర పోషించారు.

ఇటు ఆర్ఎస్ఎస్ కూడా మోడీ విజయానికి తనవంతు కృషి చేసింది. మధ్య మధ్యలో వివాదస్పద ప్రకటనలు చేస్తూనే.. మోడీ కోసం అద్వానీ లాంటి అగ్రనేతని పక్కనబెట్టడానికి ఆలోచించలేదు. మోడీ ప్రధాని అయితే దేశం ఇలా ఉంటుంది.. మోడీ పీఎం కాకపోతే దేశం ఇలా ఉంటుంది.. ఫైనల్ గా నిర్ణయం మీదేనంటూ విభజన రేఖలు గీసి మరీ మోడీ ప్రభంజనం ఉధృతమయ్యేలా చూసింది.

ఒక్క ముక్కలో చెప్పాలంటే మోడీ ప్రాభావాన్ని మేగ్నిఫై చేసి… ప్రచారంలో హోరెత్తిస్తే అద్భుతాలు చేయొచ్చన్న బీజేపీ కుంభస్థలానికే గురి పెట్టి అనుకొన్న లక్ష్యాన్ని సాధించింది. క్లిష్ట పరిస్థితుల నుంచి దేశాన్ని విముక్తి చేయాలంటే మోడీని ప్రధాని చేయాలంటూ ఎత్తుకొన్న స్లోగన్ సూపర్ గా క్లిక్ అయింది. దేశం మోడీఫై కావాలంటూ ప్రతి ఒక్కరు అనుకోనేలా చేసింది. దాదాపు మూడు దశాబ్ధాల తర్వాత స్పష్టమైన మెజార్టీ సాధించిన పార్టీగా రికార్డు సృష్టించింది. మోడీ ఉండగా తమకు ఎదురులేదని నిరూపించుకొంది.