నేటిఏపి సీమాంధ్ర ఎగ్జిట్ పోల్ : అసెంబ్లీ ఎన్నికల్లో ‘సైకిల్’ దే రాజ్యం

Thursday, May 15th, 2014, 02:55:49 PM IST


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తెలంగాణ – సీమాంధ్రగా విడగొట్టిన నాటి నుండి అందరి దృష్టి 2014 ఎలక్షన్స్ పైనే ఉంది. అందులోనూ ముఖ్యంగా సీమాంధ్రలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? రాజన్న వారసుడైన వైఎస్ జగన్ ని అందలం ఎక్కిస్తారా? లేక హైదరాబాద్ లానే సీమాంధ్రని కూడా డెవలప్ చేస్తాడనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడుని అందలం ఎక్కిస్తారా? అనే ప్రశ్నలు అందరి మదిలోనూ ఉన్నాయి.. ఈ ప్రశ్నలకి అసలు సిసలైన సమాధానం మే 16న దొరకనుంది. కానీ ఈ లోపు ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది? అనే విషయాలపై netiap.com నిర్వహించిన ఎగ్జిట్ పోల్ సర్వేని మీకందిస్తున్నాం..

2014 సీమాంధ్ర ఎన్నికల్లో ఒకరితో ఒకరికి గట్టి పోటీ ఇస్తున్న పార్టీలు రెండే రెండు అవే తెలుగుదేశం పార్టీ – వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు. సీమాంధ్ర ప్రజలు కూడా ఈ రెండు పార్టీల వైపే మొగ్గు చూపారు. రాష్ట్ర విభజన కారణంగా కాంగ్రెస్ పార్టీని పూర్తిగా బహిష్కరించారు. ఇక మిగిలిన చిన్న పార్టీలకు కూడా సీట్లు దొరికే అవకాశం కనిపించడం లేదు.

మేము నిర్వహించిన ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం 2014 ఎన్నికల్లో సీమాంధ్రలో టిడిపి పార్టీ సైకిల్ క్లీన్ స్వీప్ చేసే అవకాశం కనిపిస్తోంది. సైకిల్ జోరు ముందు ఫ్యాన్ గాలి పనిచేయలేదని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. తెలుగుదేశం పార్టీ 175 ఎమ్మెల్యే స్థానాల్లో దాదాలు 120 – 130 స్థానాలను గెలుచుకునే అవకాశం కనిపిస్తోంది. ఇదే గనుక జరిగితే టిడిపి చాలా హ్యాపీగా గవర్నమెంట్ ని ఫాం చేసేస్తుంది. ఇక టిడిపికి గట్టి పోటీ ఇచ్చిన వైకాపా కి మొత్తంగా 45 – 55 ఎమ్మెల్యే స్థానాలు గెలుపొందే అవకాశం ఉందని మా సర్వే చెబుతోంది. ఇక ప్రస్తుత అధికార పార్టీ అయిన కాంగ్రెస్ కి ఒక్క సీటు కూడా రాకుండా నామరూపాల్లేకుండా పోతుందని సర్వే ఫలితాలు చెబుతున్నాయి. అలాగే మిగతా చిన్న చిన్న పార్టీలకు వస్తే ఒకటి రెండు సీట్లు వచ్చే చాన్స్ ఉంది. కానీ అది కూడా కచ్చితంగా వచ్చేవి కాదని సర్వే చెబుతోంది.

ఇక లోక్ సభ స్థానాల విషయంలో కూడా ఫ్యాన్ గాలి కంటే సైకిల్ జోరే ఎక్కువగా ఉంది. సీమాంధ్రలో మొత్తం 25 ఎంపీ స్థానాలు, ఇందులో తెలుగుదేశం – బిజెపి కూటమి 18 – 20 ఎంపీ స్థానాలను గెలుచుకుంటాయని సమాచారం. ఇక మిగిలిన 5 – 7 స్థానాలను వైసీపీ గెలుచుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుత అధికార పార్టీ కాంగ్రెస్ కి గానీ, ఇతరత్రా చిన్న చిన్న పార్టీలకు గానీ ఒక్క ఎంపీ స్థానం అయినా వచ్చే అవకాశం కనిపించడం లేదు.