నేటిఏపి విశ్లేషణ : రాహుల్ ఎందుకు ఔట్ అయ్యాడు..?

Friday, May 16th, 2014, 07:25:19 PM IST

పొలిటికల్ గేమ్ లో కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ చేతులెత్తేశాడు. బ్రాండ్ మోడీ పొగలు కక్కుతున్న ఛాయ్ అయితే.. బ్రాండ్ గాంధీ మాత్రం.. చప్పగా చల్లారిన టీ మాదిరిగా తేలి పోయింది. ఫలితాలు ఈ విషయాన్ని నిజం చేస్తున్నాయి.

వందేళ్ళ పైగా చరిత్ర కలిగిన పార్టీ. ఇంచుమించు అంతే వారసత్వం కలిగిన కుటుంబం. పరదేశీ అన్నా.. ప్రైమ్ మినిస్టర్ కావడానికి పనికిరావన్నా పార్టీ గెలుపునకు మస్కట్ సోనియాగాంధీ. 2004, 2009 ఎన్నికలలో పార్టీకి తగినంత మెజారిటి వచ్చినా రాకపోయినా కేంద్రంలో అధికారంలోకి వచ్చేలా ఎత్తులు, పొత్తులూ కుదుర్చుకోగలిగారు. శభాష్.. నెహ్రూ.. గాంధీ కుటుంబ వారసత్వాన్ని నిలుపుకున్న ఇల్లాలని ప్రశంసలు పొందారు. ఇపుడేమో వయస్సు పైనబడుతోంది. అనారోగ్యం కుంగదీస్తోంది. అబ్బాయికి పెళ్ళీడు దాటిపోయింది.. పెళ్లెప్పుడని అడిగి, అడిగి అంతా విసిగిపోయారు. పెళ్ళితోపాటు పట్టాభిషేకం కొత్త సమస్యయింది. ఈ ఎన్నికలలో ఎలాగోలా గట్టెక్కి.. రాటుతేలతాడని ఎన్నికలకు సుప్రీం కమాండర్ ను చేశారు. నీ ధైర్య సాహసాలు, శక్తియుక్తులు చూపించు బిడ్డా.. అని యుద్ధరంగాన్ని అప్పగించారు. యుద్ధరంగంలో యువరాజా వారి వ్యూహాలు చూసి కమాండర్లు హడలిపోయారు.

2014 ఎన్నికల కదనరంగాన్ని దున్నేసిన రాహుల్ గాంధీ దెబ్బకు ఆ పార్టీ హైకమాండ్ మేనేజర్లు హడలిపోయారు. పాహిమాం.. సోనియా మాత.. రక్షమాం అని దండాలు పెట్టారు. ఈ ఎన్నికల విజయంతో తన పేరు గుర్తుంచుకోక పోయినా.. కొడుకు పేరు జనంలో శాశ్వతంగా నిలిచిపోవాలని సోనియా భావించారు. అందుకే ఎన్నికల ప్రచార ప్రకటనలు, పోస్టర్లు, ఇతర ప్రచార సామాగ్రి అంతటా వీలైనంత వరకు రాహుల్ యువరాజా వారి బొమ్మలు గుద్దేయమని హుకుం జారీచేశారు. కాంగ్రెస్ ఎన్నికల ప్రకటన ఆఖరి ఫ్రేమ్ లో మాత్రమే సోనియా కనిపించారు. మిగిలినదంతా రాహుల్ మయం. అయినా ఓటర్ల దగ్గర కాంగ్రెస్ పప్పులు ఉడక లేదు. సొంత నియోజకవర్గం అమేథీలో సైతం యువరాజా వారు డీలా పడ్డారని తెలియడంతో తల్లి సోనియా రంగంలోకి దిగాల్సి వచ్చింది. రాజకీయాలకు దూరంగా ఉన్న చెల్లి ప్రియాంక కూడా అమేథిలో మకాం వేసి.. బాబ్బాబు మా అన్నను గెలిపించండని ఓటరు దేవుళ్లను వేడుకున్నారు.

సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయం పాలయింది. దీనికి ముందుండి బాధ్యత వహించాల్సిన రాహుల్ గాంధీ.. అబ్బే నాకేం తెలీదు. తప్పంతా మన్మోహన్ సర్కార్ దే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. రాహుల్ నేరుగా ఈ మాటలు చెప్పక పోయినా.. కాంగ్రెస్ లోని ఆయన వందిమాగధులు మాత్రం.. ఎన్నికల ఫలితాలతో మా యువరాజుకేంటి సంబంధం అని ప్రశ్నిస్తున్నారు. బీజేపీ నేత నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఎ ప్రభుత్వం అధికారం చేపట్టడంతో కాంగ్రెస్ పార్టీలోని రాహుల్, సోనియా విధేయులు ఆత్మరక్షణలో పడ్డారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని యూపీఏ ముచ్చటగా మూడోసారి గెలిస్తే.. యువరాజు రాహుల్ ను ప్రధాని చెయ్యాలనుకున్న ఈ వందిమాగధుల ఆశలన్నీ ఒక్కసారిగా కుప్పకూలాయి. దీంతో ఈ అపజయానికి కారణం మా రాహుల్ బాబుది కాదు.. ప్రధాని మన్మోహన్ సింగ్ నాయకత్వంలోని ప్రభుత్వానిదే అంటూ కుంటి సాకులు చెబుతున్నారు.

స్వాతంత్య్రానంతరం మొదటిసారిగా లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ బలం ఇంత తక్కువ స్థాయికి పడిపోవడానికి ప్రధాన బాధ్యత గత పదేళ్లుగా పార్టీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి సారధ్యం వహించిన ప్రధాని మన్మోహన్‌సింగ్‌దేననే వాదనను సోనియా, రాహుల్ వందిమాగధులు తెరమీదికి తెస్తున్నారు. తద్వారా అధికారికంగా ప్రకటించకపోయినా కాంగ్రెస్‌ పార్టీ ప్రధాని అభ్యర్థి, పదహారవ లోక్‌సభ ఎన్నికల ప్రచార సారధి అయిన యువనేత రాహుల్‌ గాంధీని కాపాడుకొనే ప్రయత్నం ప్రారంభించారు. ఏఐసీసీ ఉపాధ్యక్షునిగా, ఎన్నికల ప్రచార కమిటీ అధ్యక్షునిగా కాంగ్రెస్‌ పార్టీ యంత్రాంగాన్ని మొత్తం తన గుప్పెట్లోకి తీసుకొన్న రాహుల్‌ గాంధీని ఓటమికి బాధ్యుడిని చేయనవసరం లేదని, పార్టీ అధికారంలో ఉన్న గత పదేళ్లలో ఆయనకు ప్రభుత్వంలో ఎలాంటి బాధ్యత లేదన్న వాస్తవాన్ని విస్మరించరాదనే కొత్త వాదనను పార్టీ సీనియర్‌ నాయకుడు, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కమల్‌నాథ్‌ ముందుకుతెచ్చారు.

2004లో కేంద్రంలో యూపీఏ అధికారానికి వచ్చిన తర్వాత పదేళ్లలో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ సంకీర్ణ ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను చేపట్టినప్పటికీ వాటిని ప్రజలకు వివరించడంలో ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ప్రభుత్వం విఫలమైందన్నది రాహుల్ వీర భక్తుల వాదన. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నాయకత్వంలోని జాతీయ సలహా మండలి (ఎన్‌ఏసీ) సూచనలు, సలహాలతోనే సమాచార హక్కు చట్టం, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఆహార భద్రత చట్టం వంటి పలు విప్లవాత్మక చట్టాలను తీసుకొచ్చినా పార్టీ, ప్రభుత్వ విజయాలను ప్రజల వద్దకు తీసుకెళ్లడంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం విఫలమైతే… అందుకు రాహుల్‌ గాంధీ ఎలా బాధ్యుడవుతాడనని ప్రశ్నిస్తున్నారు. ఏ ఎన్నికలలోనైనా ప్రజలు అధికారంలో ఉన్న ప్రభుత్వ పనీతీరును బట్టే తీర్పునిస్తారని, ఈ సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్‌ అధికారానికి దూరం కావాల్సివస్తే అందుకు పార్టీ అభివృద్ధికి, దేశాభివృద్ధికి ఎంతో శ్రమించిన అధ్యక్షురాలు, ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ బాధ్యులు కాబోరన్నారు కేంద్ర మంత్రి కమల్‌నాథ్‌.

అసలు రాహుల్‌ను ప్రధానిని చేయాలన్న ఆలోచనను కాంగ్రెస్‌ పార్టీ జనం ముందుకు తీసుకురాకుండా ఉంటే బాగుండేదని కొంతమంది రాజకీయ విశ్లేషకుల మాట. అసలే ఓ పక్క యూపీఏ స్కాముల ప్రభుత్వంగా ఉంది. మరోవైపు రాహుల్‌ లో నాయకత్వ లక్షణాలు ఏ మాత్రం లేవు. ఆయన ఎక్కడకు వెళ్లినా ఎదురుగాలే వీచింది. ఈ పరిస్థితుల్లో మోడీ లాంటి వ్యక్తికి రాహుల్‌ పోటీగా నిలవలేరని తెలిసినా.. సోనియా మనసెరిగి కాంగ్రెస్ పెద్దలు రాహుల్ పేరును తెర మీదికి తెచ్చారు. చివరికి పొగలు కక్కే మోడీ ఛాయ్ ముందు.. రాహుల్ గాంధీ బ్రాండ్.. నీటి బుడగలా తేలిపోయింది. దీంతో రాహుల్ గాంధీ భవిష్యత్ నాయకత్వం కూడా ప్రశ్నార్ధకంగా మారింది. కాంగ్రెస్ భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారడంతో యూపీఏ కూటమిలోని మిత్రపక్షాలు కూడా చేజారి పోయే ప్రమాదం కనిపిస్తోంది. పార్టీని విజయపథంలో నడిపించడంలో రాహుల్ విఫలమవడంతో.. ప్రియాంక రంగం మీదికి వస్తారేమో వేచి చూడాలి.