సీఎం ముఖ్య సలహాదారు పదవికి నీలం సాహ్ని రాజీనామా..!

Saturday, March 27th, 2021, 06:00:37 PM IST

ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు పదవికి మాజీ సీఎస్ నీలం సాహ్ని రాజీనామా చేశారు. ప్రధాన కార్యదర్శిగా పదవీవిరమణ చేసిన తర్వాత నీలం సాహ్నీని సీఎం జగన్ ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. అయితే రెండేళ్ల పాటు ఈ పదవిలో ఉండే అవకాశం ఉన్నప్పటికి ఆమెను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా ప్రభుత్వం నియమించింది. దీనికి నిన్న గవర్నర్ కూడా ఆమోదముద్ర వేయడంతో త్వరలో ఆమె ఎస్‌ఈసీగా బాధ్యతలు చేపడుతారు. దీంతో ఆమె నేడు ప్రభుత్వ ప్రధాన సలహాదారు పదవికి రాజీనామా చేశారు.

అయితే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కోసం నీలం సాహ్ని, ప్రేమచంద్రారెడ్డి, శామ్యూల్ పేర్లను ప్రభుత్వం ముందుగా ప్రతిపాదించగా అనూహ్య పరిణామాల నేపధ్యంలో చివరకు నీలం సాహ్నిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా ప్రభుత్వం నియమించింది. ఇక ప్రస్తుతం ఎస్‌ఈసీగా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీకాలం ఈ నెలాఖరుతో ముగుస్తుంది. ఆయన స్థానంలో నీలం సాహ్ని ఏప్రిల్ ఒకటో తేదీన ఎస్ఈసీగా బాధ్యతలు చేపట్టనున్నారు.